Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్య, వైద్యం, ఉపాధికి నిధులు కరువు
- సబ్సిడీలు తగ్గింపుతో ప్రజలపై భారం
- పేదలు, మధ్యతరగతి వారిపై భారం
- నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్
నవతెలంగాణ-మిర్యాలగూడ
పార్లమెంట్ చివరి పూర్తి బడ్జెట్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు నిరాశ కలిగించింది. ఎన్నో ఆశలతో ఎదురుచూసిన రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులకు ఉపయోగం కలిగించే అంశాలను బడ్జెట్లో పొందపరచలేదు. ప్రాముఖ్యత గల రంగాలకు గతంలో కంటే తక్కువ నిధులు కేటాయించడం, ఉన్న రాయితీలు తగ్గించడంతో ప్రజలపై మరింత భారంపడే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు వివక్ష చూపింది. ప్రధానంగా కరువుతో అల్లాడుతున్న గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ చట్టం కింద పని దినాలు పెరుగుతాయనుకుంటే నిరాశ మిగిల్చింది. కనీసం ఈ పథకానికి నిధులు కూడా పెంచకపోవడంతో ఉపాధి కరువయ్యే పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న విష్ణుపురం జగ్గయ్యపేట రైల్వే లైన్ ఊసే కనిపించలేదు. బీబీనగర్ ఎయిమ్స్‌కు అధిక నిధులు కేటాయించలేదు. ఎలక్ట్రికల్ పరికరాలైన టీవీ, మొబైల్ ఫోన్, కెమెరా లెన్స్, ఎలక్ట్రికల్ వాహనాలు ధరలు తగ్గగా టైర్లు, సిగరెట్లు, బంగారం, వెండి, వజ్రాలు ధరలు విపరీతంగా పెంచారు. సామాన్యులకు బంగారం వెండి మరింత ప్రియంగా మారింది. నేషనల్ డిజిటల్ పేరిట దేశాన్ని అప్పుల డిజిటల్‌గా మారుస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధానంగా రైతులు, కార్మికులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, పేద, మధ్యతరగతి కుటుంబాలను పూర్తిగా విస్మరించారని ఆరోపిస్తున్నారు.
ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్
జూలకంటి రంగారెడ్డి(మాజీ ఎమ్మెల్యే)
2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను రూ.45,03,097 కోట్లతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భారతదేశంలో దారిద్య్రం లేకుండా చేస్తామని, పేదలు లేని భారత్‌ను ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని ఘనంగా ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను గణనీయంగా తగ్గించారు. గత సంవత్సరం రాష్ట్రాల నుండి వచ్చే పన్నుల్లో కేంద్రం 42శాతం తిరిగి రాష్ట్రాలకు ఇవ్వగా, గత ఏడాది నుండి 41 శాతానికి తగ్గించింది. తెలంగాణకు 2.133 శాతం మాత్రమే తిరిగి వస్తుంది. అవికూడా సకాలంలో ఇవ్వడం లేదు.15వ ఫైనాన్స్ కమిషన్ కేటాయించిన ప్రకృతివైపరీత్యాల పరిహారం, స్థానిక సంస్థల నిధులు, మున్సిపాలిటీలకు ఇచ్చే నిధులు, ఉన్నత విద్య, ఆరోగ్యం తదితర రంగాలకు కేంద్రం నుండి రావాల్సిన నిధుల్లో రాష్ట్రానికి కోత పెట్టారు. రాష్ట్రంలో సాగునీటి వనరులకు నిధులు ఇవ్వాలని కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది. పైగా రాష్ట్ర నదులపై కేంద్రం బోర్డులు వేసి తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం నిర్మాణాలు ఆగిపోయాయి. రాష్ట్రానికి మంజూరు చేసిన రైల్వేలైన్లకు నిధుల కేటాయింపు తగ్గింది. దశాబ్ధాల తరబడి మంజూరైన కొన్ని పనులు పెండింగ్‌లోనే వుండిపోయాయి. కేంద్రం రాష్ట్రంపై కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నట్లు ఈ బడ్జెట్లో స్పష్టమైంది. ఈ బడ్జెట్లో రూ.10,79,971 కోట్లు (24శాతం) వడ్డీలకిందనే చెల్లిస్తున్నారు. స్వదేశీ, విదేశీ అప్పులు కలిపి రూ.137లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఎకనమిక్ సర్వే తెలుపుతున్నది. 2025నాటికి 5ట్రిలియన్ డాలర్ల దేశ స్థూల ఉత్పత్తిని సాధిస్తామని ప్రధాని మోడీ అనేకసార్లు ప్రకటించారు. రానున్న రెండేళ్ళలో రెట్టింపు స్థూల ఉత్పత్తి పెరుగుతుందా? ఈ యేడాది దేశ వృద్ధిరేటు 7శాతం ఉన్నట్టు చెపుతూనే 2023-24లో 6.5శాతానికి తగ్గుతుందని ఆర్థికమంత్రి చెప్పారు. ఈ స్థితిలో దేశాభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది?
ఉపాధిహామి చట్టానికి 2022-23లో 89,400 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో 2023-24కు 60,000 కోట్లకే పరిమితం చేశారు. అలాగే ఆహార సబ్సిడీని గత సంవత్సరంపై 50శాతం తగ్గించారు. గ్యాస్‌పై సబ్సిడీని తగ్గించారు. ఆకలి సూచికలో భారతదేశం 191 దేశాల్లో 140వ స్థానాన్ని ఆక్రమించింది. విద్యలో 33వ స్థానం, ఆరోగ్యంలో 66వ స్థానం ఉన్న దేశం అభివృద్ధి కావడానికి ప్రస్తుత బడ్జెట్ సహకరిస్తుందా? ప్రజలు దారిద్య్రంలోకి వెళుతున్నప్పటికీ కార్పొరేట్లకు మాత్రం ఎన్పీఏల పేరుతో రూ.12లక్షల కోట్లు రుణాలు రద్దు చేశారు. కరోనా సందర్భంగా గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదరికాన్ని రూపుమాపేదిగా లేదు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అన్యాయం చేసే విధంగా ఉంది.
వ్యవసాయ రంగాన్ని విస్మరించిన కేంద్రం
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడానికి బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరగడం, పంటల దిగుబడులు తగ్గడంతో రైతాంగం తీవ్రంగా అప్పుల ఊబిలో కూర్కపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంటలకు గతంలో మద్దతు ధరల చట్టం చేస్తామని ప్రకటించిన నేటి బడ్జెట్లో ప్రస్తావించ లేదని విమర్శించారు. అన్ని వ్యవసాయ పంటలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. డీజిల్, పెట్రోల్, గ్యాస్, ఎరువులపై సబ్సిడీలు తగ్గించడం ద్వారా ప్రజలపై మరింత భారం వేశారు. తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి బడ్జెట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వివిధ సంస్థల్లో సుమారు 15 లక్షల పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికి వాటిని భర్తీ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. కీలక రంగాలైన విద్య, ప్రజా వైద్యానికి ఎలాంటి కేటాయింపులు పెంచకపోవడం దారుణం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ, బీబీనగర్ నుండి నడికుడి వరకు డబ్లింగ్ పనులు గురించి ప్రస్తావించకపోవడం, కాజీపేట నుండి మాచర్ల వరకు గతంలో ప్రతిపాదించిన రైల్వే లైన్‌కు నిధులు కేటాయించకపోవడం శోచనీయం.
మొత్తం బడ్జెట్‌ను పరిశీలిస్తే పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేదిగా ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలపై ఈ బడ్జెట్లో అనేక భారాలు వేసింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీసే విధంగా ఈ బడ్జెట్ ఉంది. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. ఇది ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్. ఈ బడ్జెట్‌కి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని, నిర్మాణాత్మక పోరాటాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బడ్జెట్లో జిల్లాకు అన్యాయం
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
భువనగిరి : యాదాద్రి జిల్లా వరా ప్రసాదిని అయినా మూసి కాల్వపక్షాలనకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయింపులు లేదు. చాల సందర్భాలలో హైదరాబాద్ నుండి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ అని చెప్పిన కేంద్రం ఈ బడ్జెట్ లో అ ప్రస్తావన లేదు. ఎయిమ్స్‌కు సంపూర్ణ నిధులు కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసిన విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ హోదా ప్రస్తావన చేయలేదు. ఎత్తిపోతల పథకం జాతీయ హోదా ఇస్తే యాదాద్రి భువనగిరి జిల్లా కూడా నీటి సౌకర్యం పెరిగే అవకాశం ఉంది. ఆహార సబ్సిడీ 50శాతం తగ్గించారు. గ్యాస్ సబ్సిడీ తగ్గించారు. ఉపాధి హామీ పథకం కింద నిధుల కేటాయింపులో తగ్గుదల చేశారు. చేసిన అప్పులకు చెల్లింపులకు అధిక నిధులు కేటాయించారు. ఇది పేద మధ్యతరగతి ప్రజల బడ్జెట్ కాదు. అదాని,అంబానీ ల శక్తుల బడ్జెట్.
ప్రజావ్యతిరేక బడ్జెట్
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి- మల్లు నాగార్జునరెడ్డి, సూర్యాపేట
సూర్యాపేట :కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోపభూయిష్టంగా ఉంది.ఇది పూర్తిగా ప్రజావ్యతిరేక బడ్జెట్.ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోకుండా పన్నుల వసూళ్ల ప్రతిపాదనను పెంచడం పద్ధతి కాదు.ద్రవ్య లోటు 4శాతం లోపు తీసుకురావాల్సి ఉంది.ద్రవోల్బాణాన్ని సురక్షిత జోన్లోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టలేదు.పన్నుల రూపేణా కొత్తగా ప్రజలపై రూ.3000 కోట్ల భారం,పెట్రోల్, డీజిల్‌పై పన్నుల తగ్గింపు ఊసే లేదు.వైద్య ఆరోగ్య రంగాలకు కేటాయింపులు ఆశాజనకంగా లేవు.లేఆఫ్‌లు జరుగుతున్న తరుణంలో ఉద్యోగ రంగంలో ఉపాధి రక్షణపై ప్రస్తావనే లేదు.కంపెనీలలో పెట్టుబడులు, ఈక్విటీలు, మొదలగు వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రస్తావనే లేకపోవడమంటే కార్పొరేట్లకు కొమ్ముగాస్తున్నట్టుగా ఉంది.వజ్రాల తయారీ రంగానికి మాత్రమే ప్రోత్సాహకాలు కేటాయింపు చేసి గుజరాత్ వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని చేసిన్నట్టుగా ఉంది.ప్రజల కొనుగోలు శక్తి పెరిగి వస్తు సేవల వినియోగం పెరగడం వల్ల ఆర్థిక వృద్ధి జరిగింది కానీ కేంద్రం ప్రభుత్వంతో కాదు. బడ్జెట్లో సంపన్నవర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.