Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నల్లగొండ
గ్రామపంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం రూ.19 వేలు ఇవ్వాలని, పర్మినెంట్ ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈనెల 12న పాలకుర్తి నుండి 28 హైదరాబాద్ వరకు పల్లె నుండి పట్నం పాదయాత్రను జయప్రదం చేయాలని తెలంగాణ గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్మికుల పాదయాత్ర పోస్టర్‌ను జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్యం మంచినీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణ, పన్నుల వసూలు, అనేక రకాల పనులు చేస్తూ సేవలందిస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచకుండా రూ.8,500 వేతనంతో వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వివిధ కేటగిరీలుగా ఉన్న ఉద్యోగులను జీవో నెంబర్ 51 ద్వారా మల్టీపర్పస్ విధానాన్ని తెచ్చి కార్మికులను అనేక వేధింపులు గురి చేస్తూ పనిగంటలు సెలవులు లేకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అనేక ఏండ్లుగా పనిచేస్తున్న కార్మికులందరికీ పరిమెంట్ చేయాలనే డిమాండ్ చేశారు. జిల్లాలో కార్మికులను సర్పంచులు, కార్యదర్శులు వేధింపులకు గురి చేస్తున్నారని, పంచాయితీతో సంబంధంలేని నర్సరీ ఇతర పనులు చేస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీపీఓ ఇచ్చిన సర్కులర్ ఆధారంగా అందరికీ పోస్టల్ బీమా అమలు చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం17 రోజులపాటు 300 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జీపీ కార్మికుల పాదయాత్రకు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ నాయకత్వం వహిస్తారని తెలిపారు. వీరితోపాటు మరో ఆరుగురు నడుస్తున్న ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ.సలీం, జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ, యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోతేపాక వినోద్‌కుమార్, నాయకులు ఇరిగి ఎల్లేష్, బోగిరి సైదులు, మైనం పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.