Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోదారులకు ఇవ్వని డిమాండ్ నోటీసులు
- బలవంతపు వసూలకు చర్యలు
- ఆందోళన చెందుతున్న వినియోగదారులు
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఇంటికి ఒక మీటర్ ఉంటుంది... ఆ మీటర్ ఇంటి బయట ఉంటుంది... ప్రతి నెల ఒకటో తేదీ నుండి 5వ తేదీలోపు కరెంటు డిపార్ట్మెంట్ వారు వచ్చి రీడింగ్ తీసి బిల్లు చేతికి ఇచ్చి వెళ్తారు. ఆ బిల్లు ఎంత చెల్లించాలో... ఎప్పటి వరకు చెల్లించాలో వివరాలు ఉంటాయి. దాని ఆధారంగా వినియోగదారుడు ప్రతినెల బిల్లులు చెల్లిస్తూ ఉంటాడు. కానీ డిమాండ్ నోటీసు ఇవ్వకుండానే వేలాది రూపాయలు బిల్లులు మీరు కట్టాల్సిందని, వెంటనే కట్టాలంటూ కరెంటు అధికారులు వినియోగదారులపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రతినెల వచ్చే మాదిరిగా కాకుండా గతంలో మీరు వాడుకున్న కరెంటుకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతూ వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. గ్రామంలో కొంతమందికే వేలాది రూపాయల అదనపు బిల్లులు చెల్లించాలని ఆదేశిస్తుడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.
గ్రామాల్లో కొందరికి ఈ అదనపు బిల్లులు
మిర్యాలగూడ వేమనపల్లి దామరచర్ల మండలాల్లో కొన్ని గ్రామాలలో వినియోగదారులకు అదనపు కరెంటు బిల్లులు వేస్తున్నారు. మిర్యాలగూడ మండలంలోని గూడూరు, గూడూరు క్యాంపు, బోటియ నాయక్, తండా, తుంగపాడు, లావుడి తండా, వేములపల్లి మండలంలోని బుగ్గ బారు గూడెం కొన్ని గ్రామాల్లో వెలుగు చూసింది. ఆయా గ్రామాల్లో 20 నుంచి 30 మందికి ఈ అదనపు కరెంట్ బిల్లులు వచ్చాయని చెబుతున్నారు. కరెంటు సిబ్బంది వారి ఇండ్ల వద్దకు వెళ్లి మీ కరెంటు బిల్లులో బకాయి వేల రూపాయలలో ఉందని, వెంటనే ఆఫీస్‌కి వెళ్లి చెల్లించాలని ఆదేశిస్తున్నారు. ఆ అదనపు కరెంట్ బిల్లుల డిమాండ్ నోటిస్ ఇవ్వకుండానే బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కొక్కరికి పదివేల నుంచి మొదలుకొని లక్షల రూపాయల వరకు అదనపు కరెంటు బిల్లులు బకాయి ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు. అంత బిల్లు మాకెందుకు వస్తుందని... అంత వాడకం మేము ఎప్పుడూ చేయలేదని వినియోదారులు మొత్తుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఆయా గ్రామాలలో వందలాదిమంది వినియోగదారులకు ఈ అదనపు కరెంటు బకాయిలు పేరిట కరెంట్ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి దష్టికి తీసుకురాగా శుక్రవారం ఆయన ఆయా గ్రామాలలో పర్యటించి వివరాలు సేకరించారు. కరెంటు అధికారులతో మాట్లాడి వినియోగదారులపై భారం మోపడం కరెక్టు కాదని హెచ్చరించారు. బలవంతపు వసూళ్లకు పాల్పడితే బలమైన ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు బానోతు శంకర్
మిర్యాలగూడ మండలంలోని బోటియ నాయక్ తండకు చెందిన కరెంటు వినియోగదారుడు. ఇతని ఇంట్లోనే కిరాణా షాప్ నడుపుతున్నాడు. ఆ షాపులో ఒక ట్యూబ్ లైట్ ఒక ఫ్యాను ఒక ఫ్రిడ్జ్ మాత్రమే ఉంది. ప్రతి నెల వాడకాన్ని బట్టి 400 నుంచి 600 రూపాయలు బిల్లు వచ్చేది. ఈ నెలలో కూడా అంతే వచ్చింది. కానీ దానితోపాటు ఇతను 1.07 లక్షలు కరెంట్ బిల్లు బాకీ ఉందని, ఇందులో సగమైన కట్టాలని కరెంట్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ అదనపు బిల్లుకు సంబంధించి ఎలాంటి డిమాండ్ నోటీసు ఇవ్వకుండా కరెంట్ ఆఫీస్‌లో చెల్లించాలని రోజు ఒత్తిడి చేస్తున్నారు.
ఇతని పేరు రమావత్ బిఖ్య
బోటియా నాయక్ తండా, రెండు రూముల స్లాపల్లో ప్రతి నెల కరెంటు బిల్లు 150 నుంచి 200 రూపాయలు మాత్రమే వచ్చేది. ఇతను ఇంట్లో ఫ్యాను ట్యూబ్ లేటు ఫ్రిడ్జ్ మాత్రమే ఉన్నది. ఈ నెలలో నెలవారి బిల్లుతోపాటు అధికంగా 32 వేల రూపాయలు కరెంటు బిల్లు బకాయి ఉందని అధికారులు చెప్పారు. దీనికి సంబంధించిన ఎలాంటి డిమాండ్ నోటిస్ ఇవ్వలేదు. వెంటనే పెండింగ్ బిల్లు చెల్లించాలి లేకపోతే కరెంటు కట్ చేస్తామంటూ కరెంట్ అధికారులు బెదిరిస్తున్నారు.
గతంలో తక్కువ రీడింగ్ చేశాము...
బకాయి రీడింగ్ దే ఈ అదనపు కరెంటు బిల్లు
కిసాన్ లాల్ (కరెంటు రూరల్ ఏఈ)
ఆయా గ్రామాలలో గతంలో రీడింగ్ తీసేటప్పుడు ఆ ఇండ్లకు తాళం వేసి ఉండడం వల్ల మినిమం బిల్లులు వేశాము. సిబ్బంది నిర్లక్ష్యంగా కొంతమంది రీడింగ్ తీయలేదు. అలాంటి వాటికి ఆ నెలలో కాల్చిన కరెంటు రీడింగ్ ఆధారంగా, ఇప్పుడు పెండింగ్ బిల్లులు చెల్లించాలని సూచిస్తున్నాం. వాటికి ఎలాంటి డిమాండ్ నోటీసులు ఉండవు. ఎక్కువ మొత్తంలో బకాయి ఉన్నవారికి వాయిదా పద్ధతిలో చెల్లించాలని అవకాశం కల్పిస్తున్నాం. 10000 లోపు ఉన్నవారు వెంటనే చెల్లించాలని చెబుతున్నాం.
అదనపు కరెంటు చార్జీలన్నీ రద్దు చేయాలి..
వసూలుకు ఒత్తిడి చేస్తే ఉద్యమాలు చేస్తాం
విలేకరుల సమావేశంలో జూలకంటి
పెండింగ్ కరెంట్ చార్జీలను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకట రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని బోటియా నాయక్ తండలో సందర్శించి కరెంటు వినియోగదారులతో మాట్లాడారు. అనంతరం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిబ్బంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా గతంలో రీడింగ్ తీయలేదని సాకు చూపి వేలాది రూపాయలు అదరపు కరెంటు చార్జీలు వేయడం సరైనది కాదన్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో కొన్ని గ్రామాలలో పెండింగ్ కరెంటు చార్జీలు చెల్లించాలని కరెంట్ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. వాడుకున్న కరెంటుకు ప్రతినెల బిల్లులు చెల్లిస్తున్న కరెంట్ చార్జీలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పడం దారుణమన్నారు. పైగా వినియోగదారులపై వేలాది రూపాయలు చార్జీలు మోపారని వాటిని రద్దు చేసుకోవాలన్నారు. దివాన్ నోటీస్ లేవకుండానే చార్జీలు చెల్లించాలని సూచించడం విడ్డూరంగా ఉందని చెప్పారు. సిబ్బంది అధికారులు చేసిన తప్పులకు వినియోగదారులు ఎలా బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. అదరపు చార్జీలు వినియోగదారులు ఎట్టి పరిస్థితిలో చెల్లించాలని వారిపై ఒత్తిడి తీసుకొస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనను పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు , మండల కార్యదర్శి రవి నాయక్, సీనియర్ నాయకులు జగదీష్ చంద్ర, సత్యనారాయణ రావు, రేమిడల పరుశురాములు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిల్లుట్ల సైదులు, కందుకూరి రమేష్, సీనియర్ నాయకురాలు గాదె పద్మ, హాసిని తదితరులు పాల్గొన్నారు.