Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు
- వార్తలు రాస్తే బెదిరిస్తున్న నాయకులు, అధికారులు
- పత్రిక స్వేచ్ఛకు భంగం, ప్రజాస్వామ్యానికి తూట్లు
నవతెలంగాణ-మిర్యాలగూడ
పాలకుల దౌర్జన్యాలకు ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికా స్వేచ్చకు భంగం కలుగుతుంది. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వ్యతిరేకంగా వార్తలు రాస్తే నాయకులు, అధికారులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో నిజాన్ని నిర్భయంగా పత్రికలో రాసే పరిస్థితి కనుమరుగవుతుంది. అధికార పార్టీ నాయకులు, అధికారుల తీరుతో కలానికి సంకెళ్లు పడుతుంది. దేశవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛను గొంతు నొక్కి పరిస్థితి ఏర్పడింది. ఇదే తరహాలో తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో నవ తెలంగాణ విలేకరిపై జరిగిన దాడి, అక్రమ కేసులో ఉదాహరణ. పాలకులు, అధికారుల ఆగడాలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో పత్రిక స్వేచ్ఛకు మునిగి లేకుండా పోయే ప్రమాదం ఉంది.
జర్నలిస్టుపై దాడులు, అక్రమ కేసులు
నిజాన్ని నిర్భయంగా వాస్తవాలను వెలుగులకు తీస్తున్న జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న నవతెలంగాణ విలేకరి అనిశెట్టి యాదగిరి పై ఒకటి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త అతని అనుచరులు దాడులకు పాల్పడి పైగా అక్రమ కేసులు బనాయించారు. మున్సిపాలిటీలో కౌన్సిలర్ల అసంతప్తి దష్టికి రాగా మున్సిపల్ చైర్ పర్సన్ వర్సెస్ కౌన్సిలర్ అనే శీర్షికతో కథనం రాసినందుకు మున్సిపల్ చైర్ పర్సన్ భర్త మేఘారెడ్డి అతని అనుచరులు నలుగురు యాదగిరి ఇంటిపై దాడి చేసి యాదగిరి అతని భార్య, తల్లిని గాయపరిచారు. ఈ విషయంపై యాదగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా ఎస్సై నిందితులకు అండగా నిలిచి రాజీ కోసం యాదగిరి పై ఒత్తిడి తీసుకువచ్చారు. ఒప్పుకోకపోతే ఈ యాదిగిరి చేత మరో పిటిషన్ తీసుకొని ఆ నలుగురిపై కేసు నమోదు చేస్తూనే, యాదగిరి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అక్రమ కేసు నమోదు చేశారు. ఇటీవల దామరచర్ల మండలంలో భూముల కబ్జాపై అధికారి విచారణ రాగా అట్టి విషయాన్ని వార్త రాయగా ఆ వార్త విలేకరిపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఒక దశలో ఇంటికి వెళ్లి దాడులు చేసేందుకు ప్రయత్నించారు. గతంలో ఆ విలేకరితోపాటు విలేకరు మరి కొంతమంది విలేకరులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. గతంలో మిర్యాలగూడ డివిజన్లోని ఓ పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న అవినీతిని నవ తెలంగాణలో రాయగా ఆ విలేకరిపై ఉన్నత పోలీసు అధికారి బెదిరింపులకు పాల్పడినారు. అక్రమ కేసులు బనాయిస్తామంటూ బెదిరింపులు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం అందించిన ట్రాక్టర్ల పంపిణీలో అధికార పార్టీ నాయకులే తీసుకున్నారని వార్త రాసినందుకు ఆ పార్టీ నాయకుల నుండి ఆ విలేకరికి బెదిరింపులు వచ్చాయి. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న భూకబ్జాలపై వార్తను రాస్తే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆ విలేకరిని 'నీ' అంతు చూస్తామంటూ బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో భూకబ్జాలపై ఓ విలేకరి వార్త రాస్తే ఆ విలేకరి పై అక్రమ కేసులు బనాయించి 14 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఈ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా పలు పత్రిక విలేకరులపై వార్తలు రాసినందుకు బెదిరింపులు వచ్చాయి. కొంతమంది విలేకరులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు.
జీర్ణించుకోలేకపోతున్న నాయకులు, అధికారులు
ఉమ్మడి జిల్లాలో భూకబ్జాలు అక్రమ దందాలు జోరుగా సాగుతున్నాయి. నాయకుల మధ్య పెరుగుతున్న వైరుధ్యాలు, పాలకుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి సొంత ప్రయోజనాలకు పాకులాడుతున్నారు. వీరికి అధికారులు పోలీసులు అందదండలు అందించడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోతున్నాయి. ఇలాంటి విషయాలను ప్రజలకు తెలిపేందుకు పత్రికల్లో వార్తలు రాస్తే జీర్ణించుకోలేని అధికారులు నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. ముందుగా బెదిరింపులకు దిగుతూ ఆపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ దాడుల పట్ల ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. పైగా వారి ఒత్తిడి మేరకు అక్రమ కేసులు బనాయిస్తూ విలేకరుల చేతులకు సంకెళ్లు వేస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్న ప్రశ్నించేవారు కరవై పోతున్నారు. దీంతో పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగి ప్రజాస్వామ్యానికి తూట్లు పడుతున్నాయి. భవిష్యత్తులో మీడియా స్వేచ్ఛ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.
జర్నలిస్టులు ఐక్యంగా ఉద్యమించాలి
ఎలాంటి జీతభత్యాలు లేకున్నా ప్రజాసేవ కోసం మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల దాడులు, అక్రమ కేసులు అడ్డుకునేందుకు జర్నలిస్టులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. సంఘాలకు, పత్రికలకు అతీతంగా జర్నలిస్టులందరూ ఒక తాటి పైకి వచ్చి బలమైన ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక జర్నలిస్టుకు అన్యాయం జరిగితే వందలాది జర్నలిస్టులు రోడ్లపైకి వస్తారనే సంకేతాన్ని ప్రజలోకి తీసుకెళ్లినప్పుడే జర్నలిస్టులకు రక్షణ అందుతుంది. సమాజంలో జరుగుతున్న అన్యాలను, పాలకుల, అధికారుల అవినీతిని ఎప్పటికప్పుడు వెలుగులోకి తెచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంది. బెదిరింపులకు భయపడకుండా వాస్తవాలను వెలుగులోకి తేవాలి. అప్పుడే పత్రిక స్వేచ్ఛకు రక్షణ దొరుకుతుంది. జర్నలిస్ట్ పై జరుగుతున్న దాడులు అక్రమ కేసులు అడ్డుకునేందుకు జర్నలిస్టులందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది.