Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్న జాతర
నవతెలంగాణ-సూర్యాపేట
క్రీస్తుపూర్వం 500ఏండ్ల కింద చౌళ్య, చాళుక్యులు, యాదవ రాజులు,కాకతీయులు ఉండ్రుగొండ రాజధానిగా చేసుకొని పాలించేవారు.ఆ కాలంలో ఉండ్రుగొండ గుట్ట మీద పెద్దగుట్టలో శివాలయం, లక్ష్మీనర్సింహాస్వామి, లింగమంతుల స్వామి, చౌడమ్మతల్లి, ఆంజనేయ స్వామి మొదలైన దేవాలయాలను కట్టించారని పెద్దలు చెబుతూ ఉంటారు.అదేవిధంగా ప్రతి సంవత్సరం మాఘమాసంలో లింగమంతుల, చౌడమ్మతల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేవారు.జాతర సమయంలో నిండు గర్భిణీ లింగస్వామి మొక్కు చెల్లించి బోనం కుండ పూజా సామగ్రితో మంద గంపను ఎత్తుకొని పెద్దగట్టు ఎక్కుతుండగా కాలుజారి కింద పడి మతి చెందినట్టు చరిత్ర చెబుతుంది.దీనికి చలించిన లింగమంతుల స్వామి భక్తుల సౌకర్యార్థం గొల్లగుట్టపై వెలిశారని నానుడి. కాలక్రమేణా కాకతీయుల రాజ్యం పతనం కావడంతో ఆ తర్వాత వచ్చిన నవాబులు ఉండ్రుగొండను పాలించారు.అదే సమయంలో కొంతమంది దుండగులు లింగమంతుల స్వామి, చౌడమ్మతల్లి విగ్రహాలను అపహరించి బావిలో పడేసినట్టు ప్రచారం నెలకొంది.కొంతకాలం తర్వాత కేసారం గ్రామానికి చెందిన యాదవులు,రెడ్డి వారు గొర్రె, ఆవులను మేపుతూ పెద్దగట్టు వద్దకు వెళ్లారు.కరువు కాటకాలతో ఉన్న ఈ ప్రాంతంలో నీరు లేక వారి ఇబ్బందులు పడుతుండగా గొర్రెల కాపరులకు చద్దిమూట తెచ్చిన భార్యకు లింగమంతుల స్వామి నిండుకొని జీవాలు, గొర్రెల కాపరుల దాహం తీరాలంటే చూపించిన చోట బావి తవ్వాలని చెప్పడం, ఆమె మాట ప్రకారం బావి తవ్వుతుండగా లింగమంతుల స్వామి, చౌడమ్మతల్లి,శివ లింగాలు దొరకడం, విగ్రహాలు బయట పడే సమయంలో సిగం వచ్చి పూజలు చేయాలని చెప్పడంతో లింగమంతుల, చౌడమ్మతల్లి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నట్టుగా కథలుగా చెప్పుకుంటున్నారు.
మరొక కోణంలో ...
ఈ ప్రాంత వాసులు దురాజ్‌పల్లి జాతర గురించి రకరకాలుగా చెప్పులు చెప్పుకునే చరిత్ర ఇలా ఉంది.నాలుగు దశాబ్దాల కింద దురాజ్‌పల్లి ప్రాంతం దట్టమైన అభయారణ్యంలో ఉండేది.వల్లభాపురం, కాశీంపేట, ఉండ్రుగొండ, దురాజ్‌పల్లి ప్రాంతాలలో యాదవులు తమ గొర్రెల మందలను తెచ్చి ఈ ప్రాంతాలలో వారు మేపేవారు.ఈ ప్రాంతాలలో క్రూర మగాలు కూడా అధిక సంఖ్యలో ఉండేవి. మేత కోసం వచ్చిన గొర్రెలు, మేకలను వందల సంఖ్యలో చంపి తినేవి. దీంతో యాదవులు దిక్కుతోచని స్థితిలో శివుడికి మొరపెట్టుకుంటారు.దీంతో శివుడు లింగమంతుల స్వామి గుర్రంపై త్రిశూల ధారియై ఈ ప్రాంతంలో సంచరిస్తూ క్రూరమగాలను వధించసాగాడు.క్రూరమగాలను వధించిన రాక్షస అనుగ్రహంతో అవి వాటి రక్తపు చుక్కలు భూమిపై పడుతుండడంతో మళ్లీ బతుకుతుండడంతో లింగమంతుల స్వామి సోదరి చౌడమ్మ ఆ స్థలంలో రాక్షస మాయ కలిగిన మగాల రక్తపు చుక్కలు కింద పడకుండా నాలుకను చాపింది.దీంతో క్రూర మగాల రక్తం నేలపై పడకుండా ఆమె నాకడంతో మగాలన్ని మతి చెందాయి.అప్పటినుండి యాదవులు కతజ్ఞతగా శివుడికి పిల్ల తల్లి గొర్రెను బలివ చూపారు. దానికి శివుడు తాను శాఖాహారినని తన సోదరి చౌడమ్మకు బలివ్వమనడంతో వారు మొక్కులు చెల్లించుకున్నారు.అప్పుడు యాదవులు శివున్ని తమతో ఉండాలని వేడుకోవడంతో ఇక్కడ వెలిశాడని ప్రతీతి.
ఇంకొక కథనం...
పూర్వం పెద్దగట్టు సమీపంలో గల కేసారం గ్రామానికి చెందిన గొర్ల లింగారెడ్డి మరికొందరు గొర్రెలకాపర్లుగా అక్కడికి చేరుకున్నారు.గొర్రెలు మేస్తుండగా గొర్ల లింగారెడ్డి చెట్టు కింద నిద్రకు ఉపక్రమించాడు.నిద్రలో లింగారెడ్డికి శివుడు ప్రత్యక్షమై తాను మర్రిచెట్టు సమీపంలో గల బావిలో పుడకపోయానని తనను వెలికితీయాలని, తీసి ప్రతిష్ఠ చేయాలని చెప్పి మాయమయ్యాడని పెద్దలు చెబుతూ ఉండేవారు. దీంతో అతను ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పి మరుసటి రోజు బాగా బావిలో వెతకగా గుర్రంపై భారీగా త్రిశూల దారిగా ఉన్నా శివుడి విగ్రహం బయటపడింది. దీంతో ఆ విగ్రహాన్ని వెలికి తీసి పెద్ద గట్టుపై ప్రతిష్ఠించి జాతర జరుపుతున్నారు.ఇప్పటికే కేసారం గొర్ల వంశీయులు దేవుడికి గొర్రెలను బలివ్వడం దేవరపెట్టెకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది.ఈ రకంగా పెద్దగట్టు జాతర చరిత్ర కథలుకథలుగా చెప్పుకుంటున్నప్పటికీ ప్రతి రెండేండ్లకోసారి వచ్చే పెద్దగట్టు జాతరను ఐదు రోజుల పాటు యాదవ కులస్తులు ఘనంగా జరుపుకుంటారు.