Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ రూరల్
ఇండ్లు లేని మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని స్థలం ఉన్న కార్మికుల ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) పట్టణ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎండీ. సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయం నుండి తహసీిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, డ్వాక్రా కార్మికులు సుమారు 750 మంది పారిశుద్ధ్యం, ట్రాక్టర్ వివిధ వాహనాల డ్రైవర్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, పార్కుల నిర్వహణ, వివిధ విభాగాలలో పనిచేస్తున్నారన్నారు. అందులో 90 శాతం మంది దళితులని, ఇండ్లు లేని నిరుపేదలని తెలిపారు. మున్సిపల్ కార్మికులందరికీ ప్రత్యేకంగా స్థలం కొనుగోలు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి మున్సిపల్ కోటర్స్గా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధ వహించి కార్మికుల కాలనీ నిర్మించి పంపిణీ చేయాలని కోరారు.
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు ఇతర సమస్యలు చర్చించిన సందర్భంలో మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వ హామీ ప్రకారం మున్సిపల్ కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, యూనియన్ నల్లగొండ పట్టణ కార్యదర్శి పెరిక కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, పెరిక అంజమ్మ, ఇస్రము పాండు, పందుల లింగయ్య, ఏర్పుల శ్రావణ్ కుమార్, జీడిమెట్ల నరసింహ, కత్తుల సావిత్రమ్మ ,తీగల ఎల్లమ్మ, యాదయ్య, అనుసూర్య, తదితరులు పాల్గొన్నారు.