Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని నిరసన
ననవతెలంగాణ-మోత్కూర్
మోత్కూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు మంగళవారం విధులు బహిష్కరించారు. రోజూ ఉదయం నాలుగు గంటలకు విధుల్లో చేరే కార్మికులు విధులను బహిష్కరించడంతో పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలంటూ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ నవంబర్, డిసెంబర్, జనవరి నెలలకు సంబంధించిన వేతనాలు రావాలని, సంక్రాంతి పండక్కి కూడా జీతాలు ఇవ్వకపోవడంతో తమ కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాణా షాపుల్లో సరుకులను ఉద్దెర కూడా ఇవ్వడం లేదని, మూడు నెలలుగా తెలిసిన వారి వద్ద అప్పులు చేసి కుటుంబాలను వెళ్లదీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే తమకు మూడు నెలల జీతాలు ఇప్పించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి, కమిషనర్ శ్రీకాంత్ కార్మికులతో మాట్లాడి ఒక నెల జీతం వెంటనే ఖాతాల్లో వేయిస్తామని హామీ ఇవ్వడంతో సిబ్బంది విధుల్లో చేరారు.
మున్సిపల్ కమిషనర్ వివరణ
ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సి శ్రీకాంత్ ను వివరణ కోరగా నవంబర్, డిసెంబర్, జనవరి నెలల జీతాలు కార్మికులకు చెల్లించాల్సి ఉంది. మంగళవారం జనవరి నెల జీతాలు కార్మికుల ఖాతాల్లో జమ అయ్యాయి. ప్రభుత్వం అకౌంట్లను ఫ్రీజింగ్ లో పెట్టడంతో నవంబర్, డిసెంబర్ నెలల జీతాలు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా త్వరలోనే వస్తాయి.