Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామరచర్ల
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ సిబ్బంది చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ బీ.దయనంద్ కోరారు. బుధవారం దామరచర్లలో పాదయాత్ర పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 పెంచాలని, మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించి, పర్మినెంట్ చేసి కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సాగుతున్న పాదయాత్రలో ఉద్యోగ కార్మికులందరూ పాల్గొనాలని, ఈ పాదయాత్రకు వివిధ ఉద్యోగ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు వాడపల్లి శ్రీరాములు, గ్రామపంచాయతీ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ జహీర్, మండల ప్రధాన కార్యదర్శి సైదులు, మండల సీఐటీయూ సహాయ కార్యదర్శి ఎస్కే. సుభాని, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.