Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేవర పెట్టె తరలింపు
- హాజరైన మున్నా,మెంత బోయిన వంశస్థులు
- నేడు సూర్యాపేటకు మకర తోరణం తరలింపు
నవతెలంగాణ -చివ్వేంల/సూర్యాపేట
యాదవుల ఆరాధ్య దైవం.. తరతరాల ఆచారం.. మహిమాన్వితులకు ప్రతిరూపం.. గొల్లగట్టు(పెద్దగట్టు) జాతర. యాదవులు కుల దైవంగా ప్రసిద్ధి గాంచిన పెద్దగట్టు లింగమంతుల జాతర, తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందినది. పెద్దగట్టు జాతరకు నాలుగో రోజు భక్తజనం పోటెత్తుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి దారులన్నీ పెద్దగట్టు వైపునకే మళ్లాయి. భక్తకోటి జనమంతా దురాజ్‌పల్లి గుట్టకు బారులుదీరారు. పెద్దగట్టుపై జరుగుతున్న శ్రీ లింగమంతుల స్వామి జాతర నాలుగో రోజులు
బుధవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నెలవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెంతబోయిన వంశస్థులు నిద్ర ఘట్టంలో భాగంగా కేసారం చేరుకొని అక్కడి నుంచి ఉదయాన్నే లేచి పెద్దగట్టు కు చేరుకున్నారు. అనంతరం చంద్రపట్నం వద్ద మొక్కులు చెల్లించి దేవరపెట్టెను కదలించారు. అనంతరం చౌడమ్మ తల్లికి నెలవారం పిల్లను బలిచ్చి గొర్రె మాంసాన్ని మున్నా, మెంతబోయిన, బైకాన్లు మూడు భాగాలు పంచుకొని ప్రసాదంగా స్వీకరించారు. దీంతో నెలవారం కార్యక్రమం పూర్తయ్యింది.
దేవరపెట్టే తరలింపు...
యాదవ సంప్రదాయం ప్రకారం మెంతబోయిన వంశస్థులు కేసారం గ్రామంలో రాత్రి నిద్ర చేసి కుటుంబ సభ్యులతో పెద్దగట్టు వద్దకు చేరుకొని దేవరగుడి నుండి మందగంప, కొత్తకుండల, గొర్రెను పట్టుకొని ఊరేగింపుగా పెద్దగట్టుకు చేరుకున్నారు. విడిది ప్రాంతంలో మున్నా, మెంతబోయిన వంశస్థులు కేసారం గ్రామం నుంచి తెచ్చిన పాలు, రెండు కొత్తకుండలో పోసి మూడు సార్లు పొంగిస్తారు. తర్వాత ఒక కుండలో బియ్యం, బెల్లం, పసుపు, పాలు పోసి మరొక కుండలో బియ్యం, చక్కెర పోసి బోనాలుగా వండి బైకాని వాయిద్యాల మధ్య మున్నా,మెంతబోయిన వారు రెండు బోనాలను లింగమంతులస్వామి, చౌడమ్మ తల్లి గర్భగుడి వద్దకు ఊరేగింపుగా వచ్చారు. వారు తెచ్చిన బోనాలను లింగమంతుల స్వామి చౌడమ్మలకు నైవేద్యంగా పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. బైకాని వారు వైద్యాలు వైపుండగా మున్నా మెంతబోయిన వారు లింగా.. ఓలింగా అంటూ చంద్రపట్నంపై ఉన్న దేవరపెట్టెను కదిలించి ఎత్తి పక్కన పెట్టారు. ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం మున్నా మెంతబోయిన వారు చంద్రపట్నం ముందు ఉన్న బోనాలను కొత్తగుడ్డలో ఎత్తి తీసుకుపోయి ఆలయం ముందున్న పుట్టలో పోశారు దీంతో కార్యక్రమం ముగిసింది. అనంతరం దేవరపెట్టే ను కేసారం గ్రామానికి తరలించారు.
ప్రముఖుల దర్శనం...
బుధవారం దురాజ్ పల్లి లింగమంతుల స్వామిని జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జా దీపికా, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ తో పాటు పలువురు ప్రముఖులు స్వామి దర్శించుకున్నారు.
అధికారుల కొరడా...
పెద్దగట్టు జాతరలో నాలుగవ రోజు వ్యాపారస్తులపై కొరడా ఝులిపించారు. అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారస్తులపై కేసులు నమోదు చేశారు. తూనికల కొలతల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నలుగురు వ్యాపారస్తులపై కేసులు నమోదు చేశారు.
నేడు మూల విరాట్....
అలంకరణకు ఉపయోగించే మకరతోరణం తొలగిస్తారు. దీంతో ఐదు రోజుల పాటు జరిగే పెద్దగట్టు జాతర ముగుస్తుంది.శంభులింగా అంటూ ఐదు రోజుల పాటు స్వామివారిని పూజించిన లింగమంతుల స్వామి భక్తులు తిరిగి తమతమ స్వగ్రామాలకు పయన మవుతారు. నాదిగా సంప్రదాయంగా, లింగమంతుల ఆచారంగా వస్తున్న గొల్లగట్టు జాతరలో మొక్కులు చెల్లించి రెండేండ్ల తర్వాత మరోమారు ఇంతే ఘనంగా జాతరకు వస్తామని లింగ మంతుల స్వామికి చెప్పి మరీ వెళ్తారు. ఐదురోజుల పాటు కొండకోనల్లో ఆటపాటలతో భేరీల చప్పుళ్ళతో ఆ లింగమయ్య నామస్మరణలో భక్తులు ఆనంద పారవశ్యంతో పెద్దగట్టు జాతర నిర్వహిస్తారు.
జాతరలో బాలకార్మికలు భిక్షాటన
అధికారులు జాతర ఏర్పాట్లు చేసిన చోట ఆలయ మెట్ల వద్ద బాలకార్మికులు వేశాధారణలతో కాలిన గాయాలతోను, చేతులకు కాళ్లకు గుడ్డలు కట్టుకొని మెట్లపై పడుకోపెట్టి భిక్షాటన చేస్తున్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు ఆ పసి పిల్లలు ను చూస్తూనే వెళ్తున్నారు కాకీ బాల కార్మికుల సంక్షేమం వారికున్న చట్టాలు గుర్తుకు రావటం లేదు.