Authorization
Mon March 03, 2025 08:28:18 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లుచేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.శుక్రవారం కాన్ఫరెన్స్ హాలులో పదవ తరగతి పరీక్షల ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 3 వ తేదీ నుండి 13వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుండి 12.30 గంటల వరకు జరిగే పదవ తరగతి పరీక్షలను అధికారులు పరస్పర సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లతో నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 267 ఉన్నత పాఠశాలలకు సంబంధించి 51 పరీక్షా కేంద్రాల ద్వారా 9059 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్ పనిచేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. పోలీసు శాఖ ప్రశ్నా పత్రాల స్టోరేజీ, తరలింపు, పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని తెలిపారు. పరీక్షలు ప్రారంభమై ముగిసేంత వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వైర్లెస్ సెట్ తో ఒక అధికారి ఎళ్లవేళలా అందుబాటులో వుండాలని, పరీక్షా కేంద్రాల వద్ద జీరాక్సు సెంటర్లు మూసివుంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్స్, హెల్త్ కిట్స్ అందుబాటులో వుంచాలని తెలిపారు. ఈ సమావేశంలో చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారి కెవి ఉపేందర్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి కె నారాయణరెడ్డి, విద్యాశాఖ పరీక్షల నిర్వహణ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణారెడ్డి, నీటి పారుదల శాఖ ఇఇ లక్ష్మణ్, ఆర్టీసీ డీఎం శ్రీనివాసగౌడ్, పోస్టల్ శాఖ అధికారి భూమయ్య, టౌన్ సీిఐ జగదీశ్వరరెడ్డి, డాక్టర్ వినోద్, ట్రాన్స్‌కో డీఈ శ్రీనివాసచారి, ఎస్టిఓ వాజీదీ అలీ, గంగరాజన్ , అధికారులు పాల్గొన్నారు.