Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకరుల సమావేశంలో జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈనెల 25 నుంచి 28 తేదీ వరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగే జన చైతన్య యాత్రలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మూడు యాత్రలు సాగుతున్నట్లు తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని, కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ సంక్షేమం, మతసామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ఈ యాత్ర సాగుతుందని తెలిపారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై భారాలను మోపారని విమర్శించారు. కార్పొరేట్లకు పజల సంపదను దోచిపెడుతున్నారన్నారు. వీటిని వ్యతిరేకిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 25న సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్, 26న నేరేడుచర్ల మిర్యాలగూడలో, 27న తిప్పర్తి, నల్లగొండ, 28న యాదాద్రి భువనగిరి జిల్లాలో యాత్ర నడుస్తుందని తెలిపారు. చివరిరోజు ఈ నెల 29న మూడు యాత్రలు హైదరాబాద్కు చేరుకుంటాయని, అదే రోజు హైదరాబాదులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 26న మిరియాలగూడకు యాత్ర వస్తుందని, మండలంలోని ఆలగడప టోల్గేట్ వద్ద యాత్రను వేలాది వాహనాలతో స్వాగతం పలుకుతామన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ బహిరంగ సభకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు సీతారాములు హాజరుతున్నట్లు తెలిపారు. యాత్రకు, సభకు వేలాది మంది తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు మూడవత్ రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, భవాండ్ల పాండు, చౌగాని సీతారాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, పరశురాములు, కోడిరెక్క మల్లయ్య, గుణగంటి రామచంద్రు, ఉన్నం వెంకటేశ్వర్లు, ఏసు తదితరులు పాల్గొన్నారు.