Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుప్పలుగా పేరుకుపోయిన బిల్లులు
- ఉద్యోగులకు తప్పని తిప్పలు..
- గడువు దాటిందంటే బిల్లుల ల్యాబ్స్..
- మళ్లీ రివైజ్ అంటే ఇబ్బందులే..
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ఒకటో తేదీన రావలసిన ఉద్యోగుల వేతనాలు, పింఛన్‌దారుల పింఛన్లు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయం ఓ పక్క నెలకొనగా.. ఇతర పెండింగ్ బిల్లుల కోసం నెలలు, సంవత్సరాలు ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. వివాహాలు, వైద్య ఖర్చులు, పదవి విరమణ సొమ్ము, ఇండ్ల నిర్మాణాలు, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం తీసుకునే అడ్వాన్సులు, రుణాల సప్లిమెంటరీ బిల్లును ఎప్పటికప్పుడు క్లియర్ కాకపోవడంతో ఉద్యోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా ఒకటేమిటి ఏ బిల్లు చేతికిందక ఉద్యోగులు, పింఛనుదారులు ఖజానా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఏకంగా ఆందోళన బాట పట్టారు. వీటిలో కొన్ని బిల్లులు ఏడాదికిపైగా పెండింగ్‌లో ఉండగా మరికొన్ని ఆరు నెలలకుపైగా పెండింగ్‌లో ఉన్నాయి.
టోకెన్లు తీసుకొని పడిగాపులు...
సాధారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు బిల్లులకు డ్రాయింగ్ అండ్ డిస్బర్సుమెంట్ అధికారులు (డీడీఓ) లు తయారుచేసి జిల్లా పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ (డీపీఏఓ)లకు పంపిస్తారు. ఆ వెంటనే బిల్లుకు సంబంధించిన టోకెన్ జనరేట్ అవుతుంది. అనంతరం కొద్ది రోజుల్లోనే ఆ బిల్లు సొమ్ము ఉద్యోగి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అయితే ఏదైనా బిల్లును క్లియర్ చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ కుబేర్ పోర్టల్‌కు బిల్లును అప్లోడ్ చేసి ఆర్థికశాఖ అధికారులు ఓకే చేయాలి. అప్పుడే బిల్లులు క్లియర్ అవుతాయి. కానీ ఇప్పుడు అలా జరగటం లేదు. రాష్ట్ర ఖజానాలో సొమ్ము లేకపోవడంతో అధికారులు అనుమతించడం లేదనే ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి.
బిల్లులు ల్యాబ్స్ అయ్యే ప్రమాదం...
బిల్లులకు ఎప్పటికప్పుడు మోక్షం లభించకపోవడంతో అవి ల్యాబ్స్ అయ్యే ప్రమాదం నెలకొంది. ఏదైనా బిల్లును చేసి పంపిస్తే అదే ఆర్థిక సంవత్సరంలో దానిని క్లియర్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని బిల్లులు గత ఏప్రిల్ నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి బిల్లులు ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 లోపు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలా క్లియర్ చేయని పక్షంలో బిల్లులన్నీ ల్యాబ్స్ అవుతాయి. వీటిని మళ్లీ రివైజ్ చేసి పంపాల్సి ఉంటుంది. ఇవి డీడీఓలకు భారం కానుంది. ముఖ్యంగా పీఆర్సీ, డీఏ బకాయిలు వంటి బిల్లులను తిరిగి తయారు చేయాల్సి ఉంటుంది. వీటికి ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉండడం వల్ల లాబ్స్ అయ్యే ప్రమాదం ఉంది. అదే జీపీఎఫ్, జీఎల్ఐ వంటి బిల్లులకు ఆర్థిక శాఖచే రీవాల్యుయేట్ చేసుకోవచ్చు. వీటిని తిరిగి రివైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో అలాంటి బిల్లులను మరింత కాలం పెండింగ్‌లో పెట్టే అవకాశాలు ఉంటాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వీటిని త్వరగా క్లియర్ చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
మా దగ్గర ఏం లేదు...
జిల్లా ట్రెజరీ కార్యాలయంలో జిల్లాకు సంబంధించిన పెండింగ్ బిల్లుల వివరాలను సంబంధిత శాఖ అధికారులను అడగగా తమ దగ్గర ఏమీ లేదని, మేము చేయాల్సిన పనులన్నీ పూర్తి చేశామని, ప్రభుత్వమే బిల్లులను పాస్ చేయాల్సి ఉందని పేర్కొంటున్నారు. వాస్తవానికి జిల్లా పరిధిలో గల పెండింగ్ బిల్లుల వివరాలు అందుబాటులో ఉంటాయి. ఎన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి? ఎన్ని కోట్ల రూపాయలు కావలసి ఉంది? తదితర వివరాలన్నీ వారి వద్ద ఉన్నప్పటికీ వివరాలు ఇవ్వడానికి జిల్లా ట్రెజరీశాఖ అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లినప్పటికీ ఇదే సమాధానం వస్తూ ఉండటం గమనార్హం.
నల్లగొండ ఎస్టీఓ పరిధిలో...
నల్లగొండ ఎస్టీఓ పరిధిలోని నల్లగొండ, తిప్పర్తి, కనగల్, నార్కెట్‌పల్లి, చిట్యాల తదితర మండలాలకు సంబంధించి దాదాపు 3,600కు పైనే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి సుమారు 100 కోట్లకుపైనే నిధులు అవసరం ఉన్నట్లు ట్రెజరీ శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. నల్లగొండ ఎస్టీఓ పరిధిలోనే 100 కోట్ల రూపాయలకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటే జిల్లావ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
సమ్మెకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ సంఘాలు...
వచ్చే మూడు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సప్లమెంటరీ బిల్లులు, విడుదల చేయలేదని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆరోపించింది. బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ మూడు నెలలుగా ఎయిడెడ్ ఉపాధ్యాయుల వేతనాలు కూడా ఇవ్వడం లేదని తెలిపింది. ఈ బిల్లులను సకాలంలో విడుదల చేయకపోవడంతో యూఎస్పీసీ ఆధ్వర్యంలో గత 24వ తేదీన జిల్లా ట్రెజరీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బిల్లులను విడుదల చేయని పక్షంలో ఈనెల 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇదిలా ఉండగా పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం జిల్లా కలెక్టరేట్ ఎదుట (టాప్రా) తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమస్యలను పరిష్కరించాలని, మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఐదు మాసాలుగా పెండింగ్..
కొమర్రాజు సైదులు (ఉపాధ్యాయుడు)
జీపీఎఫ్ ఐదు మాసాల నుండి పెండింగ్‌లో ఉంది. పొదుపు చేసుకున్న డబ్బులను అవసరాలకు తీసుకునే వెసులుబాటు లేకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఐదు నెలలుగా బిల్లులను మంజూరు చేయకపోవడం వల్ల అవసరాలకు అప్పులు తీసుకువచ్చి వడ్డీలు కడుతున్నాను.
నేటి వరకు వేతనాలు అందలేదు..
చొక్కారపు లక్ష్మీనారాయణ (ఎయిడెడ్ ఉపాధ్యాయుడు)
ఎయిడెడ్ ఉపాధ్యాయులకు గత నవంబర్ నుండి నేటి వరకు వేతనాలు విడుదల కాలేదు. ఉద్యోగుల డీఏ ఏరియర్స్, ఇతర బిల్లులన్నీ గత ఏప్రిల్ మాసం నుండి నేటికీ మంజూరు కాకుండా పెండింగ్‌లోనే ఉన్నాయి. ట్రెజరీ కార్యాలయంలో బిల్లులు పాస్ అయిన ఈ-కుబేర్ సిస్టం ద్వారా ఫ్రీజింగ్ చేస్తున్నారు. టెక్నాలజీ పెరిగింది జీతాలు త్వరగా వస్తాయనుకుంటే ఏరోజు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈఎంఐలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నాం.
వైద్య ఖర్చులకోసం అప్పు చేశా...
పందిరి శ్యాంసుందర్ (రిటైర్డ్ ఉపాధ్యాయుడు)
వైద్య ఖర్చుల కోసం ఇతరుల వద్ద అప్పు చేశాను. మెడికల్ రీయంబర్స్మెంట్ సాంక్షన్ అయినాకూడా గత ఆరు నెలల నుండి ఈ-కుబేర్లోనే పెండింగ్‌లో ఉంది. అప్పు తీసుకున్న వారికి డబ్బులను సకాలంలో ఇవ్వలేకపోతున్నాను. రిటైర్డ్ అయిన మమ్ములను కూడా ఇబ్బంది పెట్టడం సరికాదు.