Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జన చైతన్య యాత్రకు అపూర్వ స్పందన
- ప్రధాన రహదారిపై మోటార్ సైకిల్ ర్యాలీ
- బీజేపీ విధానాలను ఎండగట్టిన నాయకులు
- బీజేపీ పాలనలో కానరాని ప్రజాస్వామ్యం
- సీపీఐ(ఎం( కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి
నవతెలంగాణ -నకిరేకల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ప్రజలకు తెలియజేసి చైతన్య పరిచాందుకు సీపీఐ(ఎం) చేపట్టిన జన చైతన్య యాత్ర సోమవారం 11వ రోజు నకిరేకల్ పట్టణానికి చేరుకుంది. ఈ యాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. ఊహించని రీతిలో ప్రజలు జన చైతన్య యాత్రలో పాల్గొని నాయకులకు స్వాగతం పలికారు. పట్టణంలోని తాటికల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి శివారు నుండి యాత్ర బందం నాయకులు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ రావు, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మల్లు లక్ష్మి, కందాల ప్రమీల, బొజ్జ చిన్న వెంకులు, రాచకొండ వెంకట్ గౌడ్ ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేసుకుంటూ మోటార్ సైకిల్ ర్యాలీ మధ్యన ప్రదర్శన సాగింది. తాటికల్ రోడ్డు నుండి హై స్కూల్ మీదుగా పట్టణ మెయిన్ సెంటర్ వరకు ప్రదర్శన జరిగింది. అనంతరం నాయకులు బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల ఉద్దేశించి సిపిఐ ఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద, కార్పొరేట్ విధానాలను ప్రజలకు వివరించారు. నకిరేకల్ లో జరిగిన జనచైతన్య యాత్రకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మునిసిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ తో పాటు టిఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, మల్లు లక్ష్మి మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, పట్టణ కార్యదర్శి వంటేపాక వెంకటేశ్వర్లు, నాయకులు మారయ్య, చిన్నబోయిన నాగమణి, బహు రోజు ఇందిరా తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ పాలనలో కానరాని ప్రజాస్వామ్యం
అ సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి
దేశంలో బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం కానరావడం లేదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర సోమవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ కు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని, ఉచిత విద్యుత్ తొలగించాలని, సంక్షేమ పథకాలు తొలగించాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. నిత్యవసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శతకోటీశ్వరులను తయారు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తుందని దుయ్యబట్టారు. మహిళలకు స్వేచ్ఛ లేకుండా పోతుందని హక్కులు నిర్వీర్యం చేయబడుతున్నాయన్నారు. రాష్ట్రాలకు ఉన్న హక్కులను కేంద్రం లాక్కుంటుందని, వాస్తవాలను అర్థం చేసుకొని ప్రజలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కర్ణాటకలో ఓ సందర్భంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యకు కోర్టు శిక్ష వేస్తూ తీర్పు చెబితే వెంటనే పార్లమెంటులో అతనిపై అనర్గత వేటువేయడం ఏమిటని ప్రశ్నించారు. అదాని అక్రమాలపై విచారణ జరపాలని 50 మంది విపక్ష ఎంపీలు ఆందోళన చేసే వారిని అరెస్టు చేయడం, లిక్కర్ పేరిట సిసోడియా, కవితపై కేసులు పెట్టి వేధించడం నియంతత్వ ధోరణికి నిదర్శనం అన్నారు. బిజెపి మళ్లీ గెలిస్తే అదాని, అంబానీ, కార్పొరేట్ శక్తులు తప్ప ప్రభుత్వం రంగ సంస్థలు ఉండవన్నారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారనీ వివరించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటుపరం చేసి కార్మికులను వీధున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్ళిన చరిత్ర కమ్యూనిస్టులది అన్నారు. లౌకిక విధానం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సిపిఐఎం దేశవ్యాప్తంగా పోరాడుతుందన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో వామపక్ష భావాలు ఉన్నాయని తెలిపారు. సిపిఐ ఎం, వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య, లౌకిక శక్తులతో కలిసి బిజెపి యత్నాలను తిప్పి కొడతామన్నారు దేశంలో ఒకే టాక్స్, ఒకే యాక్ట్ ఉండాలంటున్న కేంద్రం మరి ఒకే కులం ఉండాలని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు.
పేదల పక్షాన నిలబడి పోరాడేది కమ్యూనిస్టులే
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
పేదల పక్షాన నిలబడి వారి సంక్షేమం కోసం హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు సోమవారం నకిరేకల్ కు చేరుకున్న జన చైతన్య యాత్రకు సంఘీభావం తెలిపి ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలను ఎండగట్టేందుకు పేద ప్రజల పక్షపాతిగా కమ్యూనిస్టు పార్టీ ఉందన్నారు ఏనాడు అధికారం కావాలని కోరుకోని పార్టీ కమ్యూనిస్టులేనన్నారు బిజెపి పెత్తందారుల కొమ్ముకాస్తూ ప్రజా సమస్యలను ప్రస్తావించే ప్రతిపక్ష పార్టీలపై కక్షగట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు చేసి కార్పొరేటర్లకు ధారా దత్తం చేస్తుందన్నారు. దేశ సంపదను అంబానీ, ఆధానీలకు దోచిపెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బిజెపి పై సమిష్టిగా పోరాడేందుకు ప్రజలు కలిసి రావాలన్నారు. కమ్యూనిస్టుల ఆలోచన విధానాలు రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కార్మికులు సంక్షేమం వైపే ఉంటాయన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిలబడి పోరాడే పార్టీలకు అండగా ఉండి వారి పోరాటాలలో భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య,, మల్లు లక్ష్మి ,మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, పట్టణ కార్యదర్శి వంటేపాక వెంకటేశ్వర్లు, నాయకులు మారయ్య, చిన్నబోయిన నాగమణి, బహు రోజు ఇందిరా తదితరులు పాల్గొన్నారు.
బీజేపీి ప్రభుత్వానికి మహిళల పట్ల చిన్నచూపు
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ప్రమీల
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మహిళల పట్ల చిన్నచూపు ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల పేర్కొన్నారు. సోమవారం నకిరేకల్ కు చేరిన జనచైతన్య యాత్ర బహిరంగ సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. బీజేపీ పాలనలో మహిళల హక్కులు హరించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంలో విఫలమయ్యిందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తే వారిపై భిన్నభిప్రాయాలు చెప్పే వారిపై దాడులు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో ప్రజాతంత్ర వాదులు లౌకికవాదులు బీజేపీ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ఎదురించేందుకు కలిసి రావాలన్నారు.