Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ- నల్గొండ
ప్రధాని మోడీ హయాంలో మతోన్మాద రాజకీయం, కార్పొరేట్ దోపిడీ కవల పిల్లల్లా అవతరించాయని, దీనివల్ల దేశంలో దౌర్జన్యం పెచ్చురిల్లుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి దుయ్యబట్టారు . కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 17న వరంగల్లులో ప్రారంభమైన సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. సందర్భంగా పట్టణంలోని భాస్కర్ టాకీస్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం , రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ దుర్మార్గమైన విధానాలతో లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమాఖ్య స్ఫూర్తిపై దాడులు పెరిగాయని తెలిపారు. మోడీని గద్దె దించితేనే రాజ్యాంగం, ప్రజాస్వామ్య హక్కులు కాపాడబడతాయని, దేశంలో ప్రజా ఉద్యమాలు బలపడతాయని అన్నారు. 'రాజ్యాంగాన్ని రక్షిద్దాం... ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం' అనే నినాదంతో సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన జన చైతన్య మోడీ విధానాలను వ్యతిరేకించిన వారిపై దేశ ద్రోహులనే ముద్ర వేస్తున్నారని అన్నారు. దేశంలో 140 కోట్ల ప్రజలు తన వెనకే ఉన్నారనే భ్రమలో మోడీ ఉన్నారని, బిజెపికి దేశంలో కేవలం 37 శాతం మంది మాత్రమే ఓటు వేశారని, 63 శాతం వ్యతిరేకించారని గుర్తు చేశారు. బీజేపీ ియేతర ప్రభుత్వాలను గవర్నర్లతో అస్థిరపర్చడం, ప్రతిపక్ష నాయకులను సీబీఐ, ఈడీలతో హింసించడం బీజేపీ విధానంగా మారిందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా 5,500 మంది విపక్ష నేతలపై ఇడి కేసులు నమోదు చేస్తే వాటిలో కేవలం 0.5 శాతం కూడా రుజువు కాలేదన్నారు. ప్రతిపక్ష నాయకులను లొంగ దీసుకునేందుకు ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. మోడీని ఓడించేవారే లేరనేది బోగస్ ప్రచారమే అని చెప్పడానికి ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అధికారం కోల్పోయిందని, త్రిపురలో 14 మంది బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారని, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పరాభవం చవిచూసిందని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులను, ప్రజలను దోచుకుంటోందని, కొత్త ఉద్యోగాలివ్వకుండా ఉన్న ఉద్యోగాలను రద్దు చేస్తోందని విమర్శించారు. ఊచితంగా రేషన్ ఇవ్వకపోతే 80 కోట్ల మంది నిరుపేదలు బతకలేని పరిస్థితి దాపురించిందంటే దేశ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రత్యామ్నాయ విధానాలతోనే దేశానికి మేలు జరుగుతుందని, అందుకు బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదానీ ఆర్థిక కుంభకోణంలో ఆయన తప్పు లేకుంటే జెపిసి ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు. కార్పొరేట్లకు పన్ను మినహాయింపు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల నుంచి బడా వ్యాపారులు తీసుకున్న రూ.11 లక్షల కోట్లు వసూలుకు ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేస్తేనే దేశానికి మేలు జరుగుతుందని తెలిపారు. మోడీని గద్దె దించితేనే ఇది సాధ్యమవుతుందన్నారు.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలపై రాజీలేని పోరాటాలు...
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలపై రాజీలేని పోరాటాలుపోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తూ పేద,మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని విమర్శించారు.దేశంలో పెట్టుబడిదారులకు పన్నుల రేట్లలో ప్రభుత్వ రాయితీలు కల్పిస్తూ,పేద, మధ్యతరగతి వర్గాలపై భారాలు మోపడం దుర్మార్గమన్నారు.బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచిపోషిస్తూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు.ప్రధాని మోడీ తన అనుచరులైన అదాని సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ప్రశ్నించే శక్తులు మీద దాడులు చేయడమే నిదర్శనమన్నారు.
అదాని కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలి:
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
ఆధాని కుంభ కోణం పై సమగ్ర విచారణ జరిపి బ్యాంకుల నుండి తీసుకున్న లక్షల కోట్ల రూపాయలు తిరిగి కట్టించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు దాసోహమై దేశ సంపదను దోచి పెడుతున్నారని అన్నారు. అదే కోవకు చెందిన ఆదాని భారతదేశంలోని అత్యంత సంపన్నుడిగా ఎదిగిన వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 2002 రెండులో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆదానీ మోడీ మధ్య సంబంధాలు మొదలయ్యాయని ఆ సంబంధాలతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను దేశ సంపదను దాసోహం చేస్తూ కోట్ల సంపదను నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఆదానికి దోసి పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఆదాని గుప్పెట్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, బ్యాంకుల నుంచి తీసుకున్న వేలకోట్ల రుణాలను తిరిగి కట్టించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరంతరం దేశభక్తితో మాట్లాడుతున్న మోదీశా ఈ దేశ ప్రజలపై పెనుబారాలు మోపుతూ దేశ సంపదను కొంతమందికి దోచిపెట్టడం, దేశభక్తా అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి రైతు రంగానికి పోలవరం ప్రాజెక్టుకు నిధుల ఊసే లేదన్నారు. కానీ పెట్టుబడిదారీ కార్పొరేటర్లకు లక్షల కోట్లు కేటాయించడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
వామపక్షాలతో పోరాటాలు నిర్వహిస్తాం- సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
కేంద్ర ప్రభుత్వం తక్షణమే అదానిపై సమగ్ర దర్యాప్తు జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వామపక్షాలందరినీ ఐక్యం చేసి ఆదానిపై చర్యలు తీసుకునే వరకు పోరాటాలు నిర్వహిస్తామని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించడమే వామపక్షాల లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య యాత్ర రథసారథి పోతినేని సుదర్శన్, యాత్ర నాయకులు కోట రమేష్, పిట్టల రవి, , జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేశం, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, సయ్యద్ హశం, చిన్నపాక లక్ష్మీనారాయణ, పాలడుగు ప్రభావతి, మహమ్మద్ సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, గంజి మురళీధర్, నన్నూరి వెంకటరమణారెడ్డి, దండం పల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, వి. వెంకటేశ్వర్లు, రవి నాయక్, ఆనంద్, నలపరాజు సైదులు, మన్నెం బిక్షం, కందుల సైదులు, మంగారెడ్డి, గౌతమ్ రెడ్డి, కొండ వెంకన్న, కుంభం కృష్ణారెడ్డి, గుండాల నగేశ్, భూతం అరుణకుమారి పాల్గొన్నారు.