Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు
- రాత్రింబళ్లు పనిచేస్తున్న కార్మికులు
- పనిలో పూర్తిగా నిమగమైన సీపీఐ(ఎం) జిల్లా కమిటీ
- దాతలకు అభినందనలు
నవతెలంగాణ - భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు దుంపల మల్లారెడ్డి పేరుతో ఆయన స్మారకార్థం నిర్మించిన భవనం నిర్మాణం పూర్తయ్యింది. నేడు భవనాన్ని సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎస్. వీరయ్య ప్రారంభించనున్నారు. భవనం పూర్తి చేయడంలో దుంపల మల్లారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ పనులకు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ, పట్టణ,మండల కమిటీలు పూర్తి సహకరించాయి. ఐదు గదులు, ఐదు షాపులు, మీటింగ్ హాల్, స్టోర్ రూంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించారు.
విజ్ఞాన,శాస్త్రీయ భాండాగారం
దుంపల మల్లారెడ్డి స్మారక భవనం విజ్ఞాన, శాస్త్రీయ భాండాగారంగా రూపు రుద్దుకోనున్నది. ఐదేండ్లుగా దుంపల మల్లారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు . గ్రంథాలయం ఏర్పాటు చేయడంతో పాటు అనేక సెమినార్లు నిర్వహించారు. ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్, ఉచితంగా కరాటేశిక్షణ విద్యార్థులకు అందజేశారు. నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడ్డది. అందులో భాగంగా సుందరయ్య భవన్లో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే తెలంగాణ సాయుధ విప్లవ రైతాంగ పోరాటయోధుడు దుంపల మల్లారెడ్డి చేసిన సేవలను గుర్తించి ఆయన పేరు మీద నూతనంగా ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సీఐటీయూ (కార్మిక) నాయకుడు అందరికీ సుపరిచితుడు తిరందాస్ గోపి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తిరందాసు గోపి పేరుతో మరో మరో ట్రస్టు ఏర్పాటు చేశారు. ఈ రెండు ట్రస్టుల ఆధ్వర్యంలో ఎన్నో శిక్షణా కార్యక్రమాలు, అవగాహనా సదస్సులు, వైద్య చికిత్సలు ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో పేదలకు ఆహారం అందజేశారు.
జనరిక్ మెడికల్ హాల్ ఏర్పాటు
దుంపల మల్లారెడ్డి ట్రస్టు భవన సముదాయంలో దుంపల మల్లారెడ్డి పేరుతో జనరిక్ మెడికల్ హాల్‌ను అన్ని అనుమతులతో ఏర్పాటు చేశారు. ఆ మెడికల్ హాల్‌ను నేడు 28నప్రారంభించనున్నారు. జనరిక్ మందుల అతి తక్కువ ధరలు, నాణ్యత, లభించు సేవలను వివరిస్తూ ఎస్వీకే హైదరాబాద్ ఇన్చార్జ్ వినరు కుమార్‌తో అవగాహనా సదస్సు నిర్వహించారు.
రాత్రింబవళ్లు కార్మికుల పని ..
దుంపల మల్లారెడ్డి స్మారక భవనం ప్రారంభంనేడు ప్రారంభం కానుండడంతో దుంపల మల్లారెడ్డి ట్రస్ట్ తిరందాసు గోపి ట్రస్ట్ , సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తాపీ, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్, కార్పెంటర్, బండలు,రంగులు వేసే కార్మికులు రాత్రి పగలు పనిచేస్తున్నారు. వారం రోజులుగా వారు చేస్తున్న వేగవంతమైన పనులు చూసి బంజారాహిల్స్ లోని ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
సహకరించిన ప్రతి ఒక్కరికీి కృతజ్ఞతలు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు దుంపల మల్లారెడ్డి స్మారకార్దం అత్యాధునిక భవన నిర్మాణానికి సహకరించిన దాతలకు, అనుమతులు ఇచ్చిన వారికి, మహా కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీి దుంపల మల్లారెడ్డి ట్రస్టు చైర్మెన్ గూడూరు అంజిరెడ్డి, కార్యదర్శి ఎండి .జహంగీర్, ట్రస్ట్టు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. భవన నిర్మాణంలో పాలుపంచుకున్న తాఫీ మేస్త్రి తన్నీరు శ్రీనివాస్‌కు, ఇతర కార్మికులకు విప్లవ అభినందనలు తెలియజేశారు. ఈ ట్రస్టుద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు సేవ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగిం చుకోవాలని విజ్ఞప్తి చేశారు.