Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోటీపడి కొంటున్న మిల్లర్లు
- ఇతర రాష్ట్రాలలో డిమాండే కారణం
- 2300 పైన పలుకుతున్న ధర
- ఆనందోత్సవాలో అన్నదాతలు
నవతెలంగాణ -మిర్యాలగూడ
యాసంగి సీజన్ ధాన్యం కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆయకట్టుతోపాటు నాన్ ఆయకట్టులో కోతలు జరుగుతున్నాయి. ఈ సీజన్లో చీడపీడలు, దోమకాటు, తెగులు లేకపోవడంతో పెట్టుబడి కూడా తగ్గింది. ప్రకృతి సహకరించడం సకాలంలో నీటి విడుదల కావడం, అవసరమైన సాగునీరు అందడంతో ఆశించిన కంటే దిగుబడి అధికంగా వచ్చింది. ఆయకట్టులో ప్రధానంగా అంకుర్ పూజ,, హెచ్ఎంటి చింట్లు వంటి రకాల సన్నధాన్యాన్ని పెద్ద ఎత్తున పండించారు. ఎకరాకు 36 బస్తాలకు పైగా దిగుబడి రావడంతో రైతులో ఆనందం నెలకొంది. పైగా రైస్ మిల్లులు పోటీపడి మరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. హాలియా సమీపంలో గంటకు 16 టన్నుల ధాన్యాన్ని మర ఆడించే కెపాసిటీ గల భారీ స్థాయి రైస్ మిల్లు ఏర్పాటు చేశారు. అక్కడ పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నడంతో మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మిల్లర్లు ధాన్యం కొనేందుకు పోటీ పడుతున్నారు. మిల్లుకు ధాన్యం రాగానే కాంటావేసి మర ఆడించేందుకు బ్యారేక్లో పోస్తున్నారు. ఆయకట్టు ప్రాంతాలైన నల్గొండ సూర్యాపేట జిల్లాలో సుమారు 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సన్నాలకు ఇతర రాష్ట్రాలకు డిమాండే కారణం
తెలంగాణకు సమీపంలో ఉన్న మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో సన్న రకం దాన్యం ఆశించిన మేరకు పంట పండలేదు. అక్కడ సన్నధాన్యానికి డిమాండ్ ఉండడంతో తెలంగాణ పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో ఆశించిన కంటే అధికంగా సన్నధాన్యం పండించడంతో పాటు అధిక దిగుబడి రావడంతో సన్న రకం ధాన్యానికి డిమాండ్ పెరిగింది. క్వింటాలకు గ్రేడ్ వన్ ధాన్యానికి ప్రభుత్వం 2060 రూపాయలు మద్దతు ధర ప్రకటించగా గ్రేడ్ 2 ధాన్యానికి 2040 ధర ప్రకటించింది. కానీ ప్రస్తుతం సన్నధాన్యానికి 2,300 పైనే ధర వేసి కొనుగోలు చేస్తున్నారు. హెచ్ఎంటి రకం ధాన్యానికి 2400 ధర పలుకుతుందంటే సన్న రకం ధాన్యానికి ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. ఇప్పటికే ఆయకట్టులో 20శాతం మేరకు కోతలు జరిగాయి. పూజా హెచ్ఎంటి చింటూ రకం ధాన్యానికి నాణ్యతను బట్టి ప్రస్తుతం 2300 నుంచి 2370 వరకు ధర వేస్తున్నారు. మరి నాణ్యత ఉంటే 2400 ధర వేస్తున్నారు. వచ్చిన దానాన్ని వచ్చిన వెంటనే రైతుకు సంతృప్తి కలిగే విధంగా ధర వేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
ఆనందంలో అన్నదాతలు
ఈ సీజన్లో సన్న రకం ధాన్యం పండించేందుకు రైతులు అంతగా ఇబ్బందులు పడలేదు. నాణ్యమైన విత్తనాలు నాటారు. ప్రకృతి సహకరించడం... చీడపీడలు దోమకాటు తెగులు రాకపోవడంతో పెట్టుబడులు పూర్తిగా తగ్గిపోయాయి.. గతంలో ఎకరాకు మూడు నాలుగు సార్లు యూరియా చల్లేవారు. ఈ సీజన్లో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే యూరియాను చల్లారు. తక్కువ కాలంలోనే పంట చేతికి వచ్చింది. ఎకరాకు 36 బస్తాలు తగ్గకుండా పంట పండింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావడంతో రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా సన్న రకం ధాన్యానికి అమ్ముకునేందుకు ఈ సీజన్లో అంతగా ఇబ్బందులు కనిపించడం లేదు. మిల్లర్లు సన్నరకంధాన్యాన్ని పోటీపడి కొనుగోలు చేయడంతో ఈజీగా అమ్ముకుంటున్నారు. మద్దతులకంటే అదనంగా 240 నుంచి 340 వరకు ధర అధికంగా రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటకు గతంలో కంటే ఈ సీజన్లో లాభాలు కనిపిస్తున్నాయి.
ధర మంచిగా వస్తుంది :రైతు తుల్యా
నాకు రెండు ఎకరాలు వ్యవసాయ పొలం ఉంది. గతంలో మాదిరిగానే పూజా రకం సన్న రకాన్ని పండించాను. ఈ సీజన్లో ఆశించిన మేరకు సాగునీరు అందడంతో పాటు పెట్టుబడి పూర్తిగా తగ్గింది. అనుకున్న దానికంటే అధికంగా దిగుబడి వచ్చింది. రెండు ఎకరాలకు 70 బస్తాలు పైగా పంట దిగుబడి వచ్చింది. మిల్లర్లు అధిక ధర వేసి ధాన్యాన్ని కొనుగోలు చేయడం వల్ల నాకు ఈ సీజన్లో లాభం వచ్చింది.
నాణ్యమైన ధాన్యానికి మంచి ధర...
గౌరు శ్రీనివాస్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
సర రకం ధాన్యానికి మంచి డిమాండ్ ఉండడంతో మిల్లర్లు కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మిల్లులన్నీ సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాయి. పంటలు తాలు పొట్టు వ్యర్ధాలు లేకపోవడంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మర ఆడించేందుకు ఉపయోగం ఉంటుంది. మద్దతు ధర కంటే అదనంగా ధర వేసి కొనుగోలు చేస్తున్నాం.