Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొమ్మలరామారం మండలంలో ఇటుక బట్టీల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా జోరుగా సాగుతోంది. పాఠశాలకు వెళ్లాల్సిన చిన్నారులు ఇటుక బట్టీల దారి పడుతున్నారు. పలకా బలపం చేత పటాల్సిన చిట్టి చేతులతో ఇటుకల తయారు చేపిస్తున్నారు. రోడ్డు పక్కనే బట్టీలు పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. రోడ్డు అంత పొగతో కమ్ముకపోవడంతో వాహనదారులకు ఎటుపోవాలో అర్థంకాక తికమక పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు పక్కనే ఉన్న బట్టీలను తొలగించాలని కోరుతున్నారు.
- చిన్నారులతో పనిచేయించుకుంటున్న వైనం
- పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న ఇటుక బట్టీలు
- రోడ్డు వెంటనే బట్టీల నిర్వహణ
నవతెలంగాణ -బొమ్మలరామరం
మండలంలోని మర్యాలగ్రామం నుండి చికటి మామిడి గ్రామం వరకు ఇటుక బట్టీలు రోడ్డు వెంట యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు యజమానులు ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను, వారి కుటుంబ సమేతంగా పనిచేసేలా ఒప్పందం చేసుకొని ఇక్కడికి తీసుకొస్తున్నారు. వీరిలో 14 ఏండ్లలోపు పిల్లలు ఉంటున్నారు. బట్టీల నిర్వాహకులు సంబంధిత శాఖల అధికారులకు ముడుపులు ముట్టజెప్పుతుండడంతో పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నా నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని పలువురు చర్చించుకుంటున్నారు.
అక్రమంగా మట్టి తరలింపు
చెరువులలోని మట్టిని రాత్రి సమయాలలో అక్రమంగా బట్ట్టీలకు తరలించి వాటితో ఇటుకలను తయారు చేస్తున్నారు. అధికారుల అండతో వ్యాపారిలది ఆడింది ఆటగా పాడిందే పాటగా సాగుతున్నది.రైతు వద్ద ఇటుకల వ్యాపారులు వ్యవసాయ భూమిని లీజ్‌కు తీసుకొని వ్యాపార పనులు చేపడుతున్నారు. పంటలు సాగుచేస్తున్న రైతులను మభ్యపెట్టి వారి పొలాల్లో ఇటుకలు తయారు చేస్తున్నారు. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్‌ను తమ వ్యాపారానికి వాడుకుంటున్నా సంబంధిత అధికారులు స్పందించడంలేదు. గ్రామానికి 5కిలో మీటర్ల దూరంలో బట్టీలను ఏర్పాటు చేయాలనే నిబందనలు ఉన్న గ్రామానికి కూతవేటు దూరంలోనే ఇటుక బట్టీలను ఏర్పాటు చేశారు. ఇటుక బట్టీలు కాల్చిన సమయంలో వెలువడే పొగతో ఉపిరి ఆడడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఇటుక రూ.6 నుంచి రూ.8 వరకు విక్రయిస్తున్నారు. వర్షాకాలం ముగియడంతో ప్రస్తుతం 8 నెలల పాటు ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా సాగుతుంది. మర్యాల నుండి చీకటిమామిడి వరకు, అక్కడినుండి మండల కేంద్రానికి రోడ్డు పక్కనే ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నా సంబంధిత అధికారులు సైతం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కూలీలతో వెట్టి చాకిరి
ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు ఒరిస్సా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి వెట్టి చాకిరి చేపిస్తున్నారు. వారి వివరాలు కూడా కార్మిక శాఖ తెలపడం లేదు. కనీస వేతనాలు ఇవ్వకుండా రాత్రి పగలు వారితో పనులు చేయించుకుంటున్నారు. కార్మికులకు తాగునీరు, సరైన వసతులు వైద్యసాకారం వారి పిల్లలకు పాఠశాలలు వంటి వసతేల్లేవు.
బట్టీల పొగతో చస్తూ బతుకుతున్నాం
శ్రీనివాస్..చీకటిమామిడి గ్రామం
ఇటుక బట్టీలు కాల్చిన సమయంలో వెలువడే పొగతో శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. రోడ్డు పక్కనే ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు చోద్యం చేస్తున్నారు. ఇదే అదనంగా బట్టి నిర్వాహకులు రెచ్చిపోతూ విచ్చలవిడిగా బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటుక బట్టీలను ఊరుకు దూరంగా ఏర్పాటు చేయాలని అందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి.
నిరంతరం తనిఖీ చేపట్టాలి
రాక్యల శ్రీశైలం, సీపీఐ (ఎం) మండల కార్యదర్శి
ఇటుక బట్టీలను నిరంతరం అధికారులు తనిఖీ చేయాలి. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోతే యజమానులపై చర్యలు తీసుకోవాలి. రోడ్డు పక్కనే బట్టీల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, రోడ్డు పక్కనే బట్టీలు తొలగించాలి.వలస కార్మికులకు రక్షణ, భద్రత కల్పించాలి. లేబర్, రెవెన్యూ అటవీ, మైనింగ్, పొల్యూషన్, పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వల్లనే బట్టీల యజమానులు విచ్చలవిడిగా బట్టీలు నిర్వహిస్తున్నారు.