Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే దేశానికి శ్రీరామరక్ష
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
బాబా సాహెబ్ ఆలోచనలను అమలుచేయడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేధ్కర్ 132 వ జయంతి మహోత్సవం శుక్రవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఖమ్మం క్రాస్‌రోడ్‌లో అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞానానికి, మేధస్సుకు సింబల్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు.ఆయన రాసిన రాజ్యాంగమే దేశానికి శ్రీరామరక్ష అన్నారు.ఆయన స్పూర్తిని శాశ్వతంగా ఉంచడానికే సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా ఆ మహనీయుని 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేయించారని తెలిపారు.అంబేద్కర్‌ను గుర్తించింది దేశంలో కేసీఆర్ మాత్రమేనన్నారు.విద్యను హక్కుగా పొందుపరిచి దేశానికి వెలుగులు ఇచ్చిన మహనీయుడని కొనియాడారు.ఆర్ధిక, సామాజిక సమానత్వం కోసం ఆయన కట్టుబడి ఉన్న తీరు ప్రజాస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తుందని తెలిపారు.అనంతరం అదనపు కలెక్టర్ హేమంత పటేల్ కేశవ్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక సంస్కర్తగా న్యాయనిపుణిడిగా,ఆర్థికవేత్తగా, భారతరాజ్యాంగ ముసాయిదాగా అభివర్ణించవచ్చన్నారు.తాను డాక్టర్ బీఆర్.అంబేద్కర్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో చదువుకున్నానని తెలిపారు.ఈ కళాశాల మహద్‌కు చాలా దగ్గరలో ఉందని ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ నాకు వ్యక్తిగతంగా స్ఫూర్తినిచ్చిన ప్రసిద్ధ చావధాన్ కథ్ సత్యాగ్రహాం అని గుర్తు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ తెలిపిన దానిలో మూడు విషయాలు ముఖ్యమైనవని మొదటి జ్ఞానం కోసం కోరిక ఉండాలి, మీరు చదివేటప్పుడు విషయాల అర్థం చేసుకుంటే తప్ప మీ హక్కులను అర్థం చేసుకోగలరు. రెండవది మీ హక్కు కోసం పోరాడడంలో పురోగతి ఉండదు, మీ హక్కులను మీరు తెలుసుకొని ఐక్యంగా పోరాడాలని ఆయన చెప్పారు.మూడో ముఖ్యమైన విషయం ఏమిటంటే జీవితం గొప్పగా ఉండాలి దీర్ఘకాలం కాదు, సాంఘిక మరియు సంక్షేమాల కోసం, ఇతరుల కోసం పనిచేయడానికి మనకు అద్భుతమైన అవకాశం లభించింది మనం మన జీవితాన్ని వృధా చేయకూడదు నేను మీ అందరిని అభ్యర్థిస్తున్నానన్నారు.అనంతరం సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అంబేద్కర్ జీవిత చరిత్ర మీద పిల్లలకు వ్యాసరచన పోటీలు ఎస్సీ హాస్టల్ నందు నిర్వహించగా గెలుపొందిన వారికి మంత్రి చేతుల మీదుగా నగదు బహుమతులు ప్రదానం చేశారు.గ్రంథాలయ శాఖ ద్వారా నిర్వహించిన వ్యాసరచన మరియు కవి సమ్మేళనం కార్యక్రమంలో గెలుపొందిన వారికి సన్మానం చేసి సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ,జిల్లా అదనపు ఎస్.మోహన్‌రావు, జెడ్పీ వైస్‌చైర్మెన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్,బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వీ, చివ్వెంల ఎంపీపీ కుమారిబాబునాయక్, జెడ్పీటీసీ సంజీవనాయక్, కౌన్సిలర్లు జ్యోతి శ్రీవిద్య, భరత్‌మహాజన్, వెంపటిగురూజీ, చినశ్రీరాములు, మున్సిపల్ మాజీ చైర్మెన్ జుట్టుకొండ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే దోసాపటి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.