Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు
- కనీస సౌకర్యాలు కరువు
- ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు?
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
అర్జీల పరిష్కారం దేవుడు ఎరుగు.. అర్జీ ఇచ్చేందుకు వచ్చే ప్రజలకు ఎండ తాకిడి తప్పడం లేదు. రాష్ట్ర విపత్తుల శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా గత కొన్ని రోజులుగా సూర్యప్రతాపం తారాస్థాయికి చేరడంతో ఉదయం పదిగంటల దాటితే బయట కాళ్ళు పెట్టాలంటే జంకాల్సిన పరిస్థితి నెలకొంది. అరగంటకోసారి నోరు తడారిపోతుంది. ఈ నేపథ్యంలో వద్ధులు దీర్ఘకాలిక రోగులకు ప్రతికూలమే. ఈ క్రమంలో జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు వడదెబ్బ తాకే అవకాశాలు ఉన్నాయి. ఉదయం 10 గంటల తర్వాత ప్రజావాణి ప్రారంభం అవుతుంది. ప్రజలు అప్పటివరకు ఎదురుచూడాల్సి వస్తుంది. అర్జీని అధికారులకు ఇచ్చి వెళ్లేందుకు మరో గంట సమయం పడుతుంది. తదుపరి తమ స్వస్థలాలకు చేరేందుకు ఎండలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. జిల్లా కలెక్టర్ చోరవచూపి సమయాన్ని మార్చాలని ప్రజలు కోరుతున్నారు.
ఉదయమే నిర్వహించడం ఉత్తమం..
జిల్లాలో ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజావాణి సమయాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజలు ప్రజావాణికి రావాల్సిందే. ఫోన్లో ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. ఉదయం 10.30 గంటల తర్వాత అర్జీలను స్వీకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కౌంటర్, రసీదుల విభాగ సిబ్బంది కూడా కార్యాలయానికి అప్పుడే చేరుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ విభాగం రసీదుల విభాగం ఉదయం ఏడు గంటలకే ప్రారంభిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ప్రతి సోమవారం ప్రజావాణిలో విధులు నిర్వహించే ఉద్యోగులకు మూడు గంటలు ముందుగానే విధులకు వెళ్లేలా ఏర్పాటు చేయాలి. అలాగే ప్రజావాణి అర్జీలను సేకరించే సమయాన్ని 7: 30 గంటలకు ప్రారంభిస్తే శ్రేయస్కారంగా ఉంటుంది. 11 గంటలలోగా అర్జీ స్వీకరణ పూర్తయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు పగటి ఎండ తగలకుండా ఇంటికి చేరుకునే అవకాశం ఉంది.
మండల ప్రజావాణి పటిష్టం ఉత్తమం..
మండల అధికారులపై నమ్మకం లేక ప్రజలు కలెక్టరేట్‌కు వస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మండలంలో జరిగే ప్రజావాణికి పదికి మించి అర్జీలు రావడం లేదంటే వారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారులకు అర్జీలు చేస్తే చెత్తబుట్టలో పడేస్తున్నారని, జిల్లా కలెక్టర్‌ను కలిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో నల్లగొండకు చేరుకుంటున్నారు.
ప్రజావాణికి జనతాకిడి...
ప్రజావాణికి మండుటెండలోను ఆదరణ తగ్గడం లేదు. గత సోమవారం జరిగిన ప్రజావాణిలోను వందకు చేరువలో దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ టీ. వినరు కృష్ణారెడ్డి, జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి, నల్లగొండ ఆర్డిఓ జయచంద్రరెడ్డి తదితరులు అర్జీలను స్వీకరించారు.
కనీస సౌకర్యాలు కరివే...
అసలే ఎండలు మండుతుండగా కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఈ క్రమంలో వారికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో విమర్శలకు తావిస్తుంది. ప్రవేశద్వారం వద్ద మంచి నీటి వసతి ఏర్పాటు చేయలేదు. ప్రతి సారీ ఎండాకాలంలో ప్రధాన ద్వారం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేవారు. కానీ ఈసారి అటువంటి ఏర్పాటు ఏమి చేయకపోవడంతో ప్రజలు నానా తండాలు పడుతూ తడారిన గొంతులతో బయటకు పరుగులు తీయాల్సి పరిస్థితి నెలకొంది. గ్రీవెన్స్ పక్కనే మంచినీటి వసతిని ఏర్పాటు చేసిన అక్కడ కూడా నీటి వసతి సరిగా లేదని ప్రజలు పేర్కొంటున్నారు. ఇక్కడి పరిస్థితి తెలిసిన వారు మాత్రం ఇంటి నుంచి బాటిలలో నీటిని తెచ్చుకుంటున్నారు. జిల్లా కలెక్టరేట్లో ప్రవేశించగానే ఎక్కడా కూడా నీడ కనిపించే దాఖలాలు లేవు. ప్రజావాణి నిర్వహించే కలెక్టరేట్లోని సమావేశ మందిరం జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీదారులతో నిండిపోవడంతో కార్యాలయం బయటే గంటల కొద్ది ఎండలోనే నిలబడి ఎండకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జిల్లా కలెక్టరేట్లో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయాల్సిన మరుగుదొడ్ల వసతి ఊసెలేదు. సంక్షేమ శాఖలకు వెళ్లే దారిలో టాయిలెట్లను ఏర్పాటు చేసినప్పటికీ అవి నిరుపయోగంగానే ఉన్నాయి. దీంతో ప్రజావాణికి వచ్చే మహిళలు ఇబ్బందుల పాలు కాక తప్పడం లేదు. తీవ్ర ఎండలతో తమకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎండాకాలం గడిచి పోయేంతవరకు అయినా కనీస నీడ, నీటి వసతి ఏర్పాటు, మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఉదయం సమయంలోనే ప్రజావాణిని నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, అర్జీలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కలెక్టర్‌ను కోరుతున్నారు.
ఉదయాన్నే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి
పాలడుగు నాగార్జున (కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి)
ప్రజలు సమ స్యలతో కార్యాల యాల చుట్టూ తిరుగుతున్నారు. మండల స్థాయిలో సమస్యల పరిష్కారం కాకనే జిల్లా కేంద్రా నికి వస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలని కల్పించాలి. ఎండలు పోయేంతవరకు ఉదయం 7 గంటల నుండి 11 లోపల ప్రజావాణి పూర్తయ్యేలా చూడాలి. ప్రజలను గంటలకు కొద్దీ నిలబెట్టకుండా వెంటవెంటనే అర్జీలను స్వీకరించి సమస్యలు పరిష్కారం అయ్యేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి.