Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రోక్యుర్ మెంట్ అధికారుల నియామకం
- 37,078 మంది లబ్దిదారులకు పంపిణీ
- జిల్లా అధికారులతో అవగాహన సమావేశం : కలెక్టర్
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతగా గొర్రెల పంపిణీ త్వరలో ప్రారంభించనున్నందున జిల్లాలో అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టీ.వినరుకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెండవ విడత గొర్రెల పంపిణీపై జిల్లా స్థాయి అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ననుసరించి రెండవ విడత గొర్రెల పంపిణీకి గొర్రెలను కొనుగోలు చేయుటకు జిల్లా స్థాయి అధికారులను నియోజక వర్గంల వారీగా ప్రొక్యూర్ మెంట్ అధికారులుగా నియమించి నట్లు తెలిపారు. రాష్ట్రంలో రెండవ విడత గొర్రెల పంపిణీ రాష్ట్ర ముఖ్య మంత్రి, మంత్రులు ప్రారంభించిన వెంటనే జిల్లాలో గొర్రెల పంపిణీ ప్రారంభించ నున్నట్లు తెలిపారు. జిల్లాలో రెండవ విడత 37,078 మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్ లు పంపిణీ చేయనున్నట్లు,లబ్ది దారుల వివరాలు ఈ లాబ్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసి నట్లు తెలిపారు.లబ్ది దారులు చెల్లించ వలసిన వాటా ధనం 43,750 రూ.లు వర్చువల్ అకౌంట్ ద్వారా చెల్లిస్తున్నారనీ తెలిపారు.లబ్ది దారులకు సంబందించి ఆధార్,బ్యాంక్ పాస్ పుస్తకం ,నామినీ వివరాలు,కులం పరిశీలన మండల టీమ్ లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులకు మండల, సొసైటీ వారీగా లబ్దిదారుల వివరాలు అంద చేయ నున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ తరపున ఈ సారి ప్రొక్యూర్ మెంట్ అధికారులుగా నియమించిన జిల్లా అధికారులు గొర్రెలు కేటాయించిన అనంతపురం, కడప జిల్లాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలు ననుసరించి ప్రోక్యుర్ మెంట్ సెంట్రల్ ప్రొక్యూర్ మెంట్ సమన్వయంతో పారదర్శకంగా,ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా లబ్దిదారులు సంతృప్తి చెందేలా నిర్వహించాలన్నారు. 20 గొర్రెలు, ఒక పొట్టేలు కలిపి ఒక యూనిట్ గా ప్రొక్యూర్ మెంట్ చేయ వలసి వుంటుందని అన్నారు. మండలంలో అవగాహన సమావేశంలు నిర్వహించినప్పుడు ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్భుగుప్తా, పశు సంవర్థకశాఖ ఇన్చార్జి జేడీ యాదగిరి, ఏడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.