Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పచ్చని పంట పొలాల్లో డ్రీం సిటీ వెంచర్లు
- 30ఎకరాలకే అనుమతులు
- సౌకర్యాలు లేకుండా నే మార్కెటింగ్
పచ్చని పంట పొలాల్లో డ్రీం సిటీల పేరుతో రియల్ వ్యాపారులు వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. సౌకర్యాలు కల్పించకుండానే పట్టణానికి సమీపంలో.... హైవే అనుకోని... థర్మల్ ప్లాంట్ ల పేరుతో రంగుల కరపత్రాలు ముద్రించి మార్కెటింగ్ చేస్తున్నారు. అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. వ్యవసాయ పొలాలను ఫ్లాటుగా మార్చి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. డీటీసీపీ అనుమతులు కచ్చితంగా ఉండాలని నిబంధనలు చెబుతున్న వాటిని బ్రోచర్లపై ఉన్నట్లు ముద్రించి ఫ్లాట్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సమీప ప్రాంతాలలోనే ఏజెంట్లను నియమించుకొని వారికి పెద్ద మొత్తంలో కమిషన్ ఇస్తూ ధరలు పెంచి అమ్ముతున్నారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన పట్టణంలోనే నివాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాలకు ఉన్న రేట్లు మాదిరిగానే దూర ప్రాంతాల్లో ఉన్న ఫ్లాట్లకు పెట్టి విక్రయిస్తున్నారు ప్రశాంత వాతావరణ ఉంటదంటూ మాయ మాటలు చెబుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ మండలం కిష్టా పురం గ్రామంలో ఆదివారం భారీ హంగామాతో ఓ సంస్థ వెంచర్ ప్రారంభించింది. సర్వే నెంబర్. 107, 108, 109, 112, 113, 114 ల్లో సుమారు 40 ఎకరాలు భూమి కొనుగోలు చేసిన డ్రీం సిటీ సంస్థ 30ఎకరాలకే తాత్కాలిక లే అవుట్ పర్మిషన్ పొందింది. మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించకుండానే సమీపంలోని పొలాల రైతులకు అసౌకర్యం కలిగేలా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. నిబంధనల ప్రకారం లే అవుట్ అప్రూవ్ అయి రేరా అనుమతులు పొందాల్సి ఉన్నప్పటికీ బ్రోచర్ల పై మాత్రం టీఎల్పీ నెంబర్లు చూపుతూ ప్లాట్ లు విక్రయిస్తున్నారు. గజం భూమిని పది వేలకు పైగా విక్రయిస్తున్న రియల్ వ్యాపారులు అక్రమ దందాకు తెర లేపారు.
నిబంధనలు ఇలా.... !
వెంచర్ ఏర్పాటు చేసే సంస్థ ముందుగా తాను కొనుగోలు చేసిన భూమిలో 10శాతం గ్రామ పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలి. కాలనీ వాసులకు సౌకర్యవంతంగా ఉండేలా అన్ని వీధుల్లో రోడ్ల నిర్మాణం, విద్యుత్ స్టంబాల ఏర్పాటు చేసి కరెంట్ సౌకర్యం కల్పించడంతో పాటు తాగు నీటి నల్లాలు ఏర్పాటు చేసి డ్రెయినేజీ కాల్వలు నిర్మించాలి. మౌలిక వసతులు పూర్తిగా కల్పించిన తరువాతనే ప్లాట్లు విక్రయించాల్సిన రియల్ వ్యాపారులు నిబంధనలు విస్మరిస్తున్నారు. మౌలిక వసతులు కల్పించ కుండా యథేచ్ఛగా ప్లాట్లు అమ్ముతున్నారు. ప్లాట్లు విక్రయించిన అనంతరం సదరు వ్యాపారులు ముఖం చాటేసిన సందర్బలు అనేకం ఉన్నాయి.
నిర్మాణానికి నోచుకోని పార్క్, క్రీడా ప్రాంగణం:
కిష్టా పురం గ్రామం లో ఏర్పాటు చేసిన వెంచర్ లో మొత్తం 420 ప్లాట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం వెంచర్ ఏర్పాటు చేస్తున్న స్థలంలో ప్లాట్ల సంఖ్య విస్తీర్ణం బట్టి నివాస ప్రాంగణం నడుమ గాలి వెలుతురూ సౌకర్య వంతంగా ఉండేందుకు పార్క్ లు నిర్మించాలి. చిన్న పిల్లలు పెద్దలకు వేర్వేరు గా ఆట స్థలం కేటాయించాలి. కానీ రియల్ వ్యాపారులు అవేవి పాటించడం లేదు. అధికారులతో కుమ్మక్కు అవుతున్న వ్యాపారులు తమకు అనుకూలంగా లేని స్థలాన్ని పార్క్‌లు గా చూపుతూ నిబంధనలకు తుట్లు పొడుస్తున్నారు. హైవేల వెంట నిర్మించే వెంచర్లు రోడ్ సేఫ్టీ నిబంధనలు విస్మరించడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
మౌలిక వసతులు కల్పించిన తర్వాతనే రిజిస్ట్రేషన్
జానకి రాములు, పంచాయతీ కార్యదర్శి
కిష్టా పురం వెంచర్ ఏర్పాటు చేసే వారు లే అవుట్ నిబంధనలు అమలు చేయాలి. రోడ్లు, విద్యుత్, తాగు నీరు, డ్రెయినేజీ తదితర మౌలిక వసతులు కల్పించిన తర్వాతనే ప్లాట్లు విక్రయించాలి. మౌలిక వసతులు అన్ని కల్పించిన తర్వాత నే ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయబడుతాయి. ప్రజలు నిబంధనలు తెలుసుకొని ప్లాట్లు కొనుగోలు చేయాలి.