Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలనికోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో సూపరిండెంట్ కరుణాకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలో వచ్చాక ఉపాధి హామీ చట్టానికి నిధులు తక్కువగా కేటాయిస్తుందని ఆరోపించారు. గత సంవత్సరం 83 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ సంవత్సరం 63 వేల కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. 20 వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కోత పెట్టడం వల్ల ఉపాధి కూలీలకు వేతనం పెండింగ్‌లో ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే ఆలోచన ఉందని అందులో భాగంగానే నిధులను కోత పెడుతుందని విమర్శించారు. పైగా రెండు పూటలు పనిచేసిన సమయంలో రెండు ఫోటోలు అప్లోడ్ చేయాలని నిబంధనలు పెట్టడం, గ్రామీణ ప్రాంతాలు నెట్వర్క్ సరిగా పని చేయకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. దాని ఫలితంగా పనిచేసిన కూలి కోల్పోవాల్సి వస్తుందన్నారు. రోజుకు 273 రూపాయల కూలీ ఇవ్వాలని చట్టంలో ఉన్నా కనీసం వంద రూపాయలు కూడా కూలి గిట్టడం లేదని వాపోయారు. పని ప్రాంతాలలో మంచినీరు నీటి సౌకర్యం కల్పించి, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీపీఐ మండల కార్యదర్శి మూడవత్ రవి నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పిల్లుట్ల సైదులు, భవాండ్ల పాండు, చౌగాని వెంకన్న, శ్రీనివాస్, బాబు నాయక్, మల్సూర్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ : ఉపాధి కూలీలకు పెండింగ్ బిల్లులు చెల్లించి, మౌలిక సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు కంబాలపల్లి ఆనంద్ మాట్లాడారు. పీఏ పల్లి మండలంలో 31 గ్రామపంచాయతీలలో 34,589 మంది కూలీలు ఉండగా కేవలం 10 ,642 మందికి పని కల్పిస్తున్నారన్నారు. ఉపాధికూలీలకు కనీస వేతనం ఇవ్వాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఎం .చంద్రనాయక్, కూలీలు మెగావత్ చంద్ర నాయక్, లక్ష్మా నాయక్, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.