Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-డిండి
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ఓడించి సాగనంపాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి అన్నారు. సీపీఐ ప్రచార యాత్రలో భాగంగా మూడవరోజు డిండి మండలంలోని నిజాంనగర్, ఆకుతోటపల్లి, బ్రాహ్మణపల్లి, శాంతిగూడెం, కందుకూర్, దాసరినెమలిపూర్, ఖానాపురం, జైత్యతండా, టీ. గౌరారం, కామేపల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలోని వివిధ రంగాలలో జరుగుతున్న అన్యాయాలను దేశ సమైక్యత, సమగ్రతలకు, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు, ప్రభుత్వ రంగ సంస్థల విధ్వంసానికి పాల్పడుతుందన్నారు.బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా తెలంగాణపై వివక్ష వహిస్తుందన్నారు.కృష్ణానది నీటిలో తెలంగాణకు 37శాతం మాత్రమే నీళ్లు విడుదల చేస్తున్నారని, కృష్ణానదిలో వాటా దక్కకపోవడంతోనే దక్షిణ తెలంగాణ ముఖ్యంగా నల్లగొండ జిల్లా కరువు కాటకాలకు గురవుతుందన్నారు.సాగు, తాగునీరు ఇస్తే తప్ప ప్రజలు ఆత్మగౌరవంతో బతకడం సాధ్యం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 1980 నుండి కమ్యూనిస్టు పార్టీ సుదీర్ఘకాలంగా ఉద్యమించిన ఫలితంగా చేపట్టిన ఎస్ఎల్బీసీ సొరంగ పథకం, ఏఎమ్ఆర్ ఎత్తి పోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టినప్పటికీ నికరజలాలు లేకపోవడంతో అదనపు జలాలపై చేపట్టిన ప్రాజెక్టులు మిగిలిపోయినవన్నారు. కృష్ణానదిపై చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులకు సరిపోను నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు..ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు బొడ్డుపల్లి వెంకటరమణ, జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు తూము బుచ్చిరెడ్డి, మండల కార్యదర్శి కనకాచారి, సహాయ కార్యదర్శులు బొల్లె శైలేష్, తిప్పర్తి విజేందర్రెడ్డి, కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి రవీందర్శర్మ, ఏఐటీయూసీ నాయకులు నూనె వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.