Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ కార్యదర్శుల కష్టాలు తీరేది ఎన్నడో?
- జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలి
నవతెలంగాణ-తుంగతుర్తి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం తీసుకురావడం జరిగింది.దాని ప్రకారం 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మూడేండ్ల ప్రొబహిషన్ పీరియడ్ తర్వాత రెగ్యులర్ అయ్యే విధంగా నియామకాలు చేపట్టడం జరిగింది.తెలంగాణలోని పల్లెల్లో అభివద్ధి జరగాలంటే ప్రతి ఊరికి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 9355 మంది పంచాయతీ కార్యదర్శులను నియమించారు.ఈ క్రమంలో పని ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది పంచాయతీ కార్యదర్శులు రాజీనామా చేశారు.మరికొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.వారి స్థానంలో మెరిట్ లిస్ట్ రోస్టర్ ప్రకారం అవుట్సోర్సింగ్ విధానంలో పంచాయతీ కార్యదర్శుల నియామకం జరిగింది.పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరిన నాటి నుండి, ప్రభుత్వ అభివద్ధి పథకాలను ప్రజలకు అందేలా చేస్తూ పల్లెల అభివద్ధిలో భాగస్వాములు అయ్యారు.ప్రతి గ్రామపంచాయతీలో ప్రతిరోజు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా తడి, పొడి చెత్త వేరు చేస్తూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కలల ప్రాజెక్టులైన పల్లె ప్రగతి కార్యక్రమాలు, నర్సరీలు, హరితహారం పల్లెప్రకతి వనాలు, వైకుంఠధామాలు,సెగ్రిగేషన్ షెడ్లు,డంపింగ్ యార్డు లాంటి 50 రకాల పనులను గ్రామస్థాయిలో సర్పంచులతో సమన్వయం చేసుకుంటూ జేపీఎస్‌లు నిర్వహించారు. అదేవిధంగా కరోనా సమయంలో ఉపాధిహామీ పనుల బాధ్యతను కూడా తీసుకొని విజయవంతంగా నిర్వహించడంలో జేపీఎస్‌ల పాత్ర కీలకం.ప్రతిరోజు గ్రామాలలో మానసిక ఒత్తిడికి గురవుతూ ప్రభుత్వం అప్పజెప్పిన బాధ్యతను విజయవంతంగా నిర్వహించారు.ఇటీవల ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం,ఐకేపీ కేంద్రాల పనులను కూడా పంచాయతీ కార్యదర్శులకు అప్పజెప్పడం జరుగుతుంది.జీఓ నెంబర్ 26 ప్రకారం ప్రొబేషన్ కాలాన్ని మూడు సంవత్సరాల నుండి నాలుగేండ్లకు పెంచారు.ఈ ప్రొబేషన్ కాలం కూడా 11-04-2023తో పూర్తయ్యింది.దీంతో ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లు ఇవే..
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేస్తూ జీవో విడుదల చేయాలని,గడిచిన నాలుగేండ్ల ప్రొబేషన్ కాలాన్ని,సర్వీస్ కాలంగా గుర్తించాలని,ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించాలి. ప్రస్తుతం పని చేస్తున్న ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జేపీఎస్‌లుగా ప్రమోట్ చేస్తూ పనిచేసిన కాలాన్ని ప్రొబేషన్ పీరియడ్‌లో భాగంగా పరిగణించాలని వారిని కూడా రెగ్యులర్ చేయాలి.మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలి.అర్హులైన సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు కల్పించాలి.317 జీవో వల్ల నష్టపోయిన పంచాయితీ కార్యదర్శులకు న్యాయం చేయాలి పరస్పర బదిలీలు, భార్యాభర్తల బదిలీలకు అవకాశం కల్పించాలి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించని ఎడల ఈనెల 28 నుండి నిరవధిక సమ్మె చేయనున్నట్టు సమ్మె నోటీసులను విడుదల చేయడం జరిగింది.