Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
- జిల్లా ప్రధానన్యాయమూర్తి వి.బాల భాస్కరరావు
నవతెలంగాణ-భువనగిరి
రైతుకు వెన్నుదన్నుగా వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రాల ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు వి.బాల భాస్కరరావు తెలిపారు. గురువారం పట్టణంలోని రైతు వేదికలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రం న్యాయ విజ్ఞాన సదస్సును జ్యోతిప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక అని తెలిపారు. అలాంటి రైతు వ్యవసాయం, పశుపోషణలో ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహా రక మందులు, ఇన్సూరెన్స్ తదితర విషయాలలో నష్టపోకుండా అవగాహన కలిగించడం, రైతుకు వెన్నుదన్నుగా అండగా ఉండి అధికారులు, డీలర్లు మధ్య సమన్వయంతో రైతుకు లబ్ది చేకూర్చడం, రైతుల సమస్యలు, అవసరాలను న్యాయపరంగా పరిష్కరించడం కోసం న్యాయ సహాయ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. జిల్లాలో 92 రైతు వేదికలలో వారానికి రెండు సార్లు పారా లీగల్ వాలంటీర్లు, అధికారులతో కలిసి రైతులకు సహాయం, సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు .ధరణి, రైతుబంధు, రైతుబీమా తదితర రైతుకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాలు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో రైతుకు సత్వరంగా అందేలా చూడడం, రైతుకు భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి కె.మారుతీ దేవి మాట్లాడుతూరైతులకు కల్పించిన ప్రభుత్వ పథకాల అమలుకు వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. జిల్లా ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ సంస్థ సెక్రెటరీ కె దశరథ రామయ్య జిల్లా ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రాలు ప్ర్రారంభించామని, ఈ మధ్యనే జిల్లాలో నిబంధనలు పాటించని విత్తనాలు, ఎరువుల డీలర్లకు సంబంధించి 25 కేసులు నమోదు చేసినట్టు తెలెఇపారు. జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ మాట్లాడుతూ. రైతుకు భూతగాదాలే కాకుండా పంట, విత్తనాలు, ఎరువులు, డీలర్లు, తదితర సమస్యలకు ఈ వేదిక చక్కని పరిష్కారం చూపిస్తుందన్నారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ యాదాద్రి జిల్లా వ్యవసాయంతో పాటు పశు పోషణలో ముందుందని, పాల దిగుబడి అధికంగా ఉందని, ఇక్కడ సంకర జాతి పశువులు అధికంగా వున్నాయన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు వెంటనే క్లెయిమ్స్ చేసేలా చూడాలన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ సభ్యులు నాగారపు అంజయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ సదుద్దేశాలను అధికారులు రైతుల వద్దకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి.శంకర్, న్యాయవాదుల సంఘం కార్యదర్శి సి.హెచ్. రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.