Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల మధ్య విద్వేషాలతో రాజకీయ లబ్ది
- ప్రజలకు చైతన్యం కల్పించాల్సిన ఆవశ్యకత కమ్యూనిస్టులదే
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి దేశాన్ని తిరోగమనం వైపు నడిపే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని, బీజేపీ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటింద్దామని, కమ్యూనిస్టులుగా ప్రజలకు చైతన్యం కల్పించాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ మిర్యాలగూడ మండల జనరల్ బాడీ సమావేశం మండలంలోని యాద్గర్‌పల్లి గ్రామంలో ఎస్ఎన్ డీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతుల సమస్యలను గాలికొదిలేసి ప్రజల మధ్య విద్వేషాలను, మత, కుల ఘర్షణలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ది పొందుతున్నదన్నారు. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలనే ఎత్తుగడతో ముందుకు సాగుతున్న తీరును వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. దీన్ని ప్రజాస్వామిక వాదులందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గతంలోనే భారత రాజ్యాంగం చెత్త అని గోల్వాల్కర్ అనగా, మనుస్మృతి ఉండగా రాజ్యాంగం గురించి చర్చే అవసరం లేదని సంఫ్‌ు పరివార్ చెప్పిన విషయాలను ప్రస్తావించారు. ఇప్పుడు వారే రాజ్యాంగంపై కపట ప్రేమను చూపుతున్నారని విమర్శించారు. రోజువారీగా ప్రజలు చేసే ప్రతిపనిలోనూ, రాజకీయాల్లోనూ బీజేపీ తన విద్వేషాలతో కూడిన భావజాలాన్ని ఎక్కిస్తున్న తీరును విమర్శించారు. చివరకు చిన్నపిల్లల మెదళ్లల్లోనూ విషభావజాలాన్ని ఎక్కిస్తున్న తీరుపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై నేరుగా కాకుండా ఒక్కో వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ మోడీ సర్కారు ముందుకెళ్తున్నదని విమర్శించారు. దేశంలో లౌకిక విలువలు, ఆర్థిక స్వాలంబన, సామాజిక న్యాయం, ఫెడరల్ వ్యవస్థలపై దాడి తీవ్రమైందనీ, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. బీజేపీని కట్టడి చేయకపోతే దేశంలో ప్రశ్నించే గళాలలను మరింత అణచివేసే అవకాశముంటుందని హెచ్చరించారు. దేశాన్ని రక్షించుకునేందుకు బీజేపీని పాతరేయాలన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకంకావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో సీపీిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, సితారాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, సీనియర్ నాయకులు నూకల జగదీష్ చంద్ర, మండల కార్యదర్శి వర్గ సభ్యులు చౌగాని సైదమ్మ, కందుకూరు రమేష్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, గోవిందరెడ్డి, రామకృష్ణ, పొదిల్లా శ్రీను, మట్టపల్లి వెంకటేశ్వర్లు బాబూనాయక్, వెంకన్న, బొగ్గారాపు శ్రీనివాస్, మంగ తదితరులు పాల్గొన్నారు.