Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.అకాల వర్షాలతో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి.దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉరుములు మెరుపులతో శుక్రవారం రాత్రి 9 గంటలకు మొదలైన వాన సుమారు గంట పాటు కురిసింది. రెక్కలు ముక్కలు చేసుకుని ఎన్నో ఆశలతో ఆరుగాలం కష్టించి పండించిన పంటలపై వరుణదేవుడు రైతన్నల ఆశలపై నీళ్లు చల్లాడు.రాత్రనక, పగలనక ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిందని సంబరపడే లోపు అనుకోకుండా కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని చూసి అన్నదాతలు ఏం చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నారు.మండల వ్యాప్తంగా 20ఐకేపీ,మూడు పీఏసీఎస్ కేంద్రాలను ప్రారంభించారు.కానీ కొనుగోలు మరిచారు.ఇప్పటివరకు కేవలం నాలుగు ఐకెపి కేంద్రాలలో మాత్రమే ధాన్యం కొనుగోలు ప్రారంభించారు.ప్రతిఐకేపీ కేంద్రంలో దాదాపు 100 ధాన్యం రాశులు ఉన్నాయని,అధికారులు చర్యలు తీసుకొని కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అకాల వర్షాలు వస్తే ఇబ్బందులు ఉంటాయని అడిగినా కూడా అధికారులు టార్పాలిన్లు సరఫరా చేయలేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 10 రోజులు అయినప్పటికీ కేవలం 2000 క్వింటాళ్లు మాత్రమే ధాన్యం కొనుగోలు చేసింది.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా? లేక రైతులపైనే భారం వేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.మండలపరిధిలోని దేవునిగుట్ట ఐకేపీ కేంద్రం గుట్టపై ఏర్పాటు చేశారు.అకాల వర్షం చేత ఐదుగురు రైతులకు చెందిన దాదాపు 3 ట్రాక్టర్ల ధాన్యం గుట్టపై నుండి కిందిదాకా వర్షానికి వరదనీటిలో కొట్టుకపోవడం జరిగిందని రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు.నీళ్లలో కొట్టుకుపోయిన ధాన్యానికి కూడా అధికారులు నష్టపరిహారాన్ని అందించాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.
పంటనష్టం చెల్లించాలి
కౌలురైతు- గుండగాని సూర్యప్రకాష్(గానుగుబండ)
నవతెలంగాణ తుంగతుర్తి.కౌలు రైతు
అకాల వర్షం వల్ల నష్టపోయిన కౌలు రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించాలి.పది ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వరి పంటపండించి,ధాన్యాన్ని ఐకేపీ కేంద్రంలో పోశారు.టార్పాలిన్లు లేక బస్తాలతో చేసిన పట్టాలు కొనుగోలు చేసి ధాన్యం కుప్పలపై కప్పిన,ఈదురు గాలికి ఎగిరి పడడంతో వరిధాన్యం తడిసింది.దాదాపు రూ.2 లక్షల వరకు అప్పులు తీసుకొచ్చి సాగు చేశాం.కౌలు ఎలా కట్టాలో తెలియడం లేదు.ప్రభుత్వం కౌలు రైతులను పరిగణలోకి తీసుకొని పంట నష్టం నేరుగా కౌలు రైతుల బ్యాంకు అకౌంట్లో జమ చేయాలి.