Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1371 ఎకరాలలో పంట నష్టం
- నివేదిక ఇచ్చిన వ్యవసాయశాఖ
- క్షేత్రస్థాయిలో సర్వే లేకుండా నిర్ధారణ
- అంతా బోగస్ అంటున్న రైతు సంఘాల నేతలు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లాలో గత నెలలో ఈదురు గాలులు, వడగళ్ల వర్షంతో చేతికొచ్చిన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ప్రధానంగా వరి, పత్తితో పాటు ఇతర కూరగాయలు, చిరుధాన్యాల పంటలు బాగా దెబ్బతిన్నాయి. నిబంధనల మేరకు 33 శాతం నష్టం జరిగితేనే పరిగణలోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ కావడంతో అధికారులు సర్వే చేసినట్లు చూపిస్తూ చేతులు దులుపుకున్నారు. చాలాచోట్ల కోత దశలో ఉన్న పంటలను జాబితా నుండి తొలగించారు. నష్టాన్ని లెక్కల్లోకి తీసుకోవాలని రైతులు విన్నవించిన పట్టించుకో లేదు.
క్షేత్రస్థాయిలో సర్వే లేకుండా నిర్ధారణ...
గత నెలలో 17 నుండి 21వ తేదీ వరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. అత్యధికంగా కనగల్, గుర్రంపోడు మండలాల్లో 59.5 మిల్లీమీటర్ల వర్షపాతం, మర్రిగూడ మండలంలో 42.7, అడవిదేవుల పల్లి లో 34.8, తిరుమలగిరిలో 33.3, దామరచర్లలో 30.7, మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఆ సమయంలో ప్రాథమికంగా 1673 ఎకరాలలో సుమారు కోటిన్నరకు పైగా నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వానికి నివేదికను పంపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటించిన సమయంలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఎకరానికి 10 వేలు పరిహార అందిస్తామని చెప్పడంతో రైతులు ఆనందించారు. ఆ తర్వాత నిబంధనల పేరుతో వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలో కేవలం 371.24 ఎకరాలలో 324 మంది రైతులకు సంబంధించి 37.16 లక్షల రూపాయల పంట నష్టం మాత్రమే జరిగినట్లు తేల్చింది. రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాలను జిల్లా ట్రెజరీ కార్యాలయానికి కూడా పంపించారు. దీంతో వాస్తవంగా నష్టపోయిన తమ పరిస్థితి ఏంటని పంటను నష్టపోయిన రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటన చేపట్టకుండా నివేదికలు సమర్పించారని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి గ్రామాల వారిగా క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే చేయాల్సి ఉన్న ఎక్కడ క్షేత్రస్థాయికి వెళ్లి పంటలను పరిశీలించిన దాఖలాలు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పెద్దగా లేవు. కొన్ని ప్రాంతాలకు మాత్రమే చుట్టపు చుపుగా వెళ్లిన వ్యవసాయశాఖ అధికారులు ఒకే ప్రాంతంలోని పంటలను పరిశీలించి అనంతరం వెనుతిరిగారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతలు సూచించిన రైతుల పేర్లను మాత్రమే వ్యవసాయ శాఖ అధికారులు పరిగణలోకి తీసుకున్నారని రైతులు మండిపడుతున్నారు. సర్వే అంతా బోగస్ అని వారికి కావలసిన పేర్లను మాత్రమే పెట్టి వాస్తవంగా నష్టపోయిన రైతులకు జిల్లా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
ప్రామాణికత ఏది...
నష్టం అంచనాకు అధికారులు ఏ ప్రామాణికతను తీసుకుంటున్నారో కానీ వారి చర్యలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 1673 ఎకరాలలో వరి పంటతో పాటు వివిధ కూరగాయలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. అధికారులు మాత్రం కేవలం 371 ఎకరాలలో మాత్రమే నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నష్టం కూడా 33 శాతానికి లోబడే ఉన్నట్టు తేల్చారు. సాగు చేపట్టిన వరికి తీవ్రంగా నష్టం వాటిలిందని రైతులు వాపోతున్నారు. వడగళ్లతో గింజలు రాలిపోయి దిగుబడిలో సగానికి పడిపోయాయని కన్నీటి పర్వం అవుతున్నారు. అధికారులు మాత్రం 371 ఎకరాలలోనే అధీ 33 శాతానికి లోబడి వరకి నష్టం వాటిలినట్టు నివేదించారు. ఇప్పటికైనా తిరిగి జిల్లావ్యాప్తంగా రీసర్వే చేయించి వాస్తవంగా పంటలను నష్టపోయిన రైతులకు పరిహార అందించి న్యాయం చేయాలని నష్టపోయిన రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇలా వచ్చి.. అలా వెళ్లారు
నెలికంటి నరసింహ ( రైతు వెలిమినేడు)
అధికారులు ఇలా వచ్చి అలా వెళ్లారు. అన్ని పొలాలకు తిరగలేదు. మిగతావి చూసినట్టు రాసుకొని పోయారు. నేను ఐదు ఎకరాలలో వేసిన వరి ఎక్కడికక్కడ విరిగిపోయి నేలకు ఒరిగింది. విషయాన్ని కలెక్టర్కు, వ్యవసాయశాఖ జేడీకి తెలియజేశాం. ఏం స్పందన రాలేదు. మండల స్థాయి అధికారులు మాత్రం పేర్లు వచ్చేటట్టు చూస్తామన్నారు. ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు.
నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి
ఏర్పుల యాదయ్య ( సీపీఐ(ఎం) మర్రిగూడ మండల కార్యదర్శి)
అధికారులు సర్వే ఏమి చేయలేదు. ఎక్కడా తిరుగిరాలేదు. ఎవరైనా పోయి చెబితే చూసిందే తప్ప సర్వే చేయలేదు. ఇప్పటికైనా వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలి.