Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యాలయంలో ఏం జరుగుతుంది...?
- ధరణి ఆపరేటర్ ఆగడాలు ఇంత అంత కావు..
- అంతా నా చేతుల్లోనే... తహసీల్దార్‌కి ఎంత..నాకెంత..?
నవతెలంగాణ-చింతపల్లి
చింతపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఒక రియల్ ఎస్టేట్ కార్యాలయంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అసలు తహసీల్దార్ కార్యాలయంలో ఏం జరుగుతుందని, ఎవరు ఆఫీసరు ఎవరు బ్రోకర్లు తెలుసుకోవడం కష్టతరమైందని, చిన్నపిల్లల కుల, ఆదాయ సర్టిఫికెట్లతో పాటు డాక్యుమెంట్ల వరకు అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా పట్టించుకునే నాధుడే లేడని ప్రజలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నుండి చింతపల్లి మండలంలో కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చి మీరు ఇలా వచ్చి అలా వెళ్తే చాలు అంతా మేము చూసుకుంటానని ధరణి ఆపరేటర్‌పై గతంలో ఎన్నో విమర్శలు వచ్చినా సరిదిద్దుకోవటం లేదని ప్రజలు తెలుపుతున్నారు. చింతపల్లి మండలంలోని కొంతమంది ఎంపీటీసీలు పాస్‌బుక్ లేకుండా, బ్యాంకులో పాస్ బుక్‌లో ఉన్నాయని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించి ముడుపులు అప్పజెప్పిన సంఘటనలు కోకోల్లోగా ఉన్నాయని తెలుస్తుంది. ఇదిలా ఉంటే చింతపల్లి మండలంలోని కుర్మపల్లి గ్రామానికి చెందిన ముద్దం సమతమ్మ తాను రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి డిజిటల్ సంతకం కావాలని పలుమార్లు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్‌కు తెలియజేయగా, ధరణి ఆపరేటర్ మాత్రం పైకం చెల్లించుకుంటే పని అయిపోతుందని బాజాప్తుగా ముత్తం సుమతమ్మ మహిళా రైతుతో అన్నాడని బాధితురాలు వాపోతుంది. తన పేరు మీద 33 గుంటల భూమి ఉన్నప్పటికీ మరో ఎకరం ఏడు గంటల భూమి కొనుగోలు చేశానని ఆ భూమికి డిజిటల్ సంతకం కాలేదని, ఆ డిజిటల్ సంతకం కావాలంటే ముడుపులు తప్పదని ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎలా చెప్పాలని ధరణి ఆపరేటర్ అనడం గమనార్హం. అదేవిధంగా చింతపల్లి మండలంలోని కురుమేడు గ్రామానికి చెందిన బూదాం భూమి కోట్లు విలువ చేసే భూమి రిజిస్ట్రేషన్ 8 గంటలకే ఏలా చేశారని, బడా నాయకుల భూములకు ఓ లెక్క, సాధారణ, మధ్యతరగతి కుటుంబానికి చెందిన రైతులకు ఒక లెక్క... ఇలా పోతే రాను రాను తహసీల్దార్ కార్యాలయం రియల్ ఎస్టేట్ కార్యాలయంగా మారుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ నుండి ప్రతిరోజు చింతపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చేటువంటి ధరణి ఆపరేటర్, హైదరాబాదులో కోటిన్నర విలువ చేసే ఇల్లును కొనుగోలు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పైఅధికారులు స్పందించి ధరణి ఆపరేటర్‌పై, తహసీిల్దార్ పై ఎంక్వయిరీ చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
తహసీల్దార్ కార్యాలయం రియల్ఎస్టేట్ ఆఫీస్‌గా మారింది
పడకండి కష్ణయ్య (రైతు)
తహసీల్దారు కార్యాలయం రియల్ ఎస్టేట్ కార్యాలయంగా మారింది. తహసీల్దార్ కార్యాలయంలో ఎలాంటి చిన్న పనికి వెళ్లిన ఎంతిస్తావ్, ఎప్పుడొస్తావ్, లేకపోతే తహసీల్దార్ సమయం లేదంటున్నారు.
డిజిటల్ సంతకం కోసం డబ్బులు అడిగారు
ముద్దం సుమతమ్మ
డిజిటల్ సంతకం కోసం డబ్బులు అడిగారు.కురంపల్లి గ్రామంలోని ఎకరం ఏడు గుంటలకు డిజిటల్ సంతకం కావాలంటే తహసీల్దారు చెప్పిందే వినాలని అన్నారు. వెంటనే ధరణి ఆపరేటర్, తహసీల్దార్‌పై విచారణ జరిపి చర్య తీసుకోవాలి.
ప్రయివేట్ ఆపరేటర్లే అధికారులుగా చలామణి
ఉడుగుంట్ల రాములు (సీపీఐ(ఎం) మండల కార్యదర్శి)
ప్రయివేట్ ఆపరేటర్లు అధికారులుగా చలామణి అవుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ధరణి ఆపరేటర్ తానే స్వయంగా డాక్యుమెంట్లను కొట్టి వారికి అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాడు. తక్షణమే ధరణి ఆపరేటర్‌పై విచారణ జరిపించాలి.