Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని మే డే వారోత్సవాలను వాడ వాడల ఘనంగా నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి తెలిపారు. తిప్పర్తిలో మేడే సన్నాక సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం స్థానిక నర్రా రాఘవరెడ్డి భవన్లో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కుల, మతాల కతీతంగా నిర్వహించుకునే ఏకైక పోరాట దినం మే డేను కార్మికులందరూ ఐక్యంగా, ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. 1886లో అమెరికాలోని చికాగో నగరంలో 8గంటల పని విధానం కొరకు పరిశ్రమ యజమానులకు కార్మికులకు మధ్య జరిగిన పోరాటంలో అనేక మంది కార్మికులు ప్రాణాలు వదిలారని, వారి రక్తంలో తడిసిన జెండా ఎర్ర జెండా కార్మికుల పక్షాన, వారి హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు సాగిస్తూ నేడు 138వ కార్మిక దినోత్సవం జరుపుకోవడానికి సన్నద్ధమైందని తెలిపారు. గతం కంటే నేడు జరగబోయే మే డే ఉత్సవాలు ఒక ప్రాధాన్యతను సంతరించుకోబోతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మేడే విశిష్టతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తుందని, విశ్వకర్మ జయంతిని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలనే కుటిల ప్రయత్నం చేస్తుందని, ఇటువంటి దుర్మార్గమైన చర్యలను కార్మిక వర్గం ముక్త కంఠంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమణారెడ్డి, మండల కార్యదర్శి మన్నెం బిక్షంరెడ్డి, సీతారామరెడ్డి, చెనగోని వెంకన్న, గండమళ్ళ రాములు, భీమగాని గణేష్, దోంగరి వెంకన్న, జంజిరాల ఉమా, సైదులు, తదితరులు పాల్గొన్నారు.