Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 29న చలో హైదరాబాద్
నవతెలంగాణ-నల్లగొండ రూరల్
సంఘటిత, అసంఘటిత రంగాలలో ఎగుమతి దిగుమతి పనులు నిర్వహిస్తున్న హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఈనెల 29న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న మార్కెట్ హమాలీలను కలిసి లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత రంగం బజారు, గ్రామీణ హమాలీ, ప్రయివేట్ గోదాములు, కూరగాయల మార్కెట్లలో ఎగుమతి దిగుమతులు పనులు నిర్వహిస్తున్న హమాలీలకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు నిండిన హమాలీలందరికీ నెలకు 6 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని అన్నారు .ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఎఫ్సీఐ, బేవరేజెస్ ,ఎలక్ట్రిసిటీ స్టోర్, సివిల్ సప్లై, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములలో పనిచేస్తున్న అమాలీలను ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. హమాలీలకు సంక్షేమ బోర్డు సాధన లక్ష్యంగా ఈనెల 29న హైదరాబాద్ కమిషనరేట్ ముందు జరుగు ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బుర్ర లింగస్వామి, కార్యదర్శి దొండా శ్రీశైలం, కొత్త మాధవ్, జానయ్య లక్ష్మమ్మ నరసింహ తదితరులు పాల్గొన్నారు.