Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధులు లేక సర్పంచులు విలవిల
- అప్పులు చేసి పనులు
గ్రామ పంచాయతీల నిర్వహణ భారంగా మారడంతో సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు. చేసిన పనులకు బిల్లులు రాక, తెచ్చిన చోట అప్పులు చెల్లించ లేకపోతున్నారు. పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేక, వీధిలైట్ల బిల్లుల చెల్లించలేక, నీటి సరఫరా పైపులైన్లు మర మ్మతులు చేయించలేక తాము ఈ బాధలు భరించ లేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి 2010 జనాభా లెక్కల ప్రకారం గా నిధులు మంజూరు అవుతున్నాయి. 2010 నుంచి 2023కు గ్రామాల్లో జనాభా చాలా పెరిగింది. నిధు లు మాత్రం 2010 జనాభా లెక్కల ప్రకారంగా విడు దల కావడంతో ఏమూలకు సరిపోవడం లేదు.
నవతెలంగాణ- నల్లగొండ
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాభివృద్ధి ఎస్ఎఫ్సీ (రాష్ట్ర ప్రభుత్వ నిధులు), 15 ఫైనాన్స్ నిధులు (కేంద్ర ప్రభుత్వం), గ్రామ ప్రజల పన్నులతో పలు అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నది. 2019 మార్చిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ఆరునెలలు రెగ్యులర్‌గా ఎస్ఎఫ్సీ, 15 ఫైనాన్స్ నిధులు విడుదలయ్యాయి. అనంతరం ఓ నెల 15 ఫైనాన్స్ నిధులు మంజూరు అయితే, మరో మూడు నెలల తర్వాత ఎస్ఎఫ్సీ నిధులు విడుదలవుతున్నాయి. తొమ్మిది నెలలుగా 15 ఫైనాన్స్ నిధులు రాకపోవడం తో పాటు ఆరు నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల నిధులు విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సక్రమంగా మంజూరు కాకపోవడంతో ప్రజలు కట్టిన పన్నులతోనే పంచాయతీని నెట్టుకొస్తున్నారు.
అప్పులు చేసి పనులు..
జిల్లాలోని 844మంది సర్పంచ్‌లు గత సంవత్సరం మార్చి నెలలో ఖాతాలు తీశారు. ఒక నెల నేరుగా వారి ఖాతాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు జమ చేసిన కేంద్రం తర్వాత తర్వాత నిధులను విడుదల చేయడం లేదని, దీనికి తోడు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వార వచ్చే నిధులు 6 నెలలుగా నిలిచిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో చేపట్టే పారిశుధ్య నిర్వహణ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అప్పులు చేసి అభివృద్ధి చేయాల్సి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల నిలిపివేయగా ఖాతాల్లో ఉన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేయడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు.
అదనపు భారంగా ట్రాక్టర్ కిస్తులు...
ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కచ్చితంగా ఉండా లనే నిబంధన సర్పంచులకు పెనుభారంగా మారింది. ట్రాక్టర్ కిస్తులు, డ్రైవర్ జీతం, మరమ్మతులు అదనపు ఖర్చుగా ఉన్నాయి. కిస్తులు చెల్లించకుంటే ట్రాక్టర్ తీసుకెళ్తారనే భయంతో ఒకటి పారిశుధ్య కార్మికు లకు సక్రమంగా వేతనాలు ఇవ్వలేని పరిస్థితి మరొకటి నెల కొంది. రెగ్యులర్‌గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు మంజూరు చేస్తూ గ్రామాల అభివృద్ధికి సహకరిస్తూ సర్పంచుల ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలని పలువురు కోరుతున్నారు.
సిబిల్ స్కోర్‌పై ప్రభావం..
పల్లెల అభివృద్ధి కోసం అప్పు చేసేందుకు సర్పంచ్‌లు వ్యక్తిగత పాన్, ఆధార్‌కార్డులను బ్యాంకులకు అందించారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు నిలిచిపోవడంతో బ్యాంకుల్లో కిస్తులు చెల్లించడంలేదు. దీంతో బ్యాంకుల్లో వ్యక్తిగతంగా డిపాల్టర్ మారి సిబిల్ రిపోర్టుపై ప్రభావం పడటంతో వ్యక్తిగత రుణాలకు దూరమవుతున్నట్లు సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. ఒక్కో సర్పంచ్‌కు సుమారు రూ.లక్షల్లో బిల్లులు రావాల్సి ఉండగా.. అప్పులు చేసిన పలువురు సర్పంచ్‌లు వాటిని చెల్లించేందుకు ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తోది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు సర్ధుబాటు చేసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నా.. ఉన్న నిధులు ఫ్రీజింగ్లో ఉండటంతో వాడుకోలేకపోతున్నారు. జీపీలకు నిధులు నిలిచిపోవడంతో జిల్లాలోని సర్పంచ్‌లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇటీవల పలు మండలాల సర్పంచ్‌లు ఎంపీడీవోలకు వినతిపత్రాలను అందించారు. అలాగే ఇటీవల కలెక్టర్‌కు కలిసి సమస్యలను విన్నవించారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి జీపీలకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు.
పనులే భారం..
ప్రతి గ్రామంలోనూ హరితహారం నర్సరీల నిర్వహణ, ఆ మొక్కలను కాపాడటం, గ్రామీణ పార్కులు, చెత్త డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు.. ఇవన్నీ ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ బాధ్యత సర్పంచులకు అప్పగించింది. కానీ, అందుకు తగిన నిధులు సమయానికి ఇవ్వడం లేదు.టార్గెట్లు పూర్తి చేయడం కోసం అప్పులు చేసి పనులు పూర్తి చేయించిన సర్పంచులు ప్రస్తుతం నానా ఇబ్బందులు పడుతున్నారు.
వ్యక్తిగత రుణాలకు దూరమవుతున్నాం..
ఉప్పునూతల వెంకన్న యాదవ్ సర్పంచ్ జి చెన్నారం (నల్లగొండ మండలం)
ట్రాక్టర్, ట్యాంకర్లు కొనుగోలుకు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. బ్యాంకు పంచాయతీలకు ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో బ్యాంకుల్లో ఈఎంఐలు చెల్లించడంలేదు. ఫలితంగా మా ఖాతాలు డిపాల్టర్‌గా మారాల్సి వస్తుంది. సిబిల్ తగ్గడంతో వ్యక్తిగతంగా భవిష్యత్తులో నష్టం కలుగుతుంది.
జీతాలు ఇవ్వలేకపోతున్నాం..
మాడెం శాంతమ్మ సర్పంచ్ ఎరుగండ్లపల్లి (మర్రిగూడ మండలం)
జీపీల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతినెలా జీతాలు చెల్లించలేకపోతున్నాం. ట్రాక్టర్ ఈఎంఐలు, కరెంట్ బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందిగా మారింది. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వాలు నిధులను విడుదల చేయాలి. 3నెలలుగా సిబ్బందికి జీతాలు ఇవ్వడంలేదు.