Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలి అన్నదే కేసీఆర్ సంకల్పం
- విశ్వమానవ సౌధానికి కార్మికుల త్యాగలే పునాదులు
- కార్మికుల హక్కులను కాల రాస్తున్న మోడీ సర్కార్
- గుజరాత్లో కార్మిక సంఘాల నిషేధమే ఇందుకు నిదర్శనం
- కార్మికుల ఆత్మగౌరవ భవనాలకు త్వరలోనే శంకుస్థాపన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. అసంఘటితరంగ కార్మికుల కోసం 2014 నుండి 2023 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మకమైన మార్పులే ఇందుకు నిదర్శనమన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని బానుపురి భవన కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకలలో ఆయన మాట్లాడారు.విశ్వమానవ సౌధానికి కార్మికుల త్యాగలే పునాదులని భూమ్యాకాశాలు ఏకమయ్యేంత వరకు మేడే ఉత్సవాలు జరుగుతాయన్నారు.కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన చెప్పారు. అసంఘటిత రంగంలో ప్రమాదవశాత్తు మరణాలు సంభవిస్తే ఆ కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలబడ్డారని ఆయన అన్నారు.2014 నుండి 2023 వరకు ఈ తరహాలో మరణించిన 4001 బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఆరు లక్షల చొప్పున 223 కోట్ల చెల్లింపులే ఇందుకు నిదర్శనమన్నారు.అదే విదంగా అంగ వైకల్యం సంభవించిన కుటుంబాలకు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలబడ్డారని ఆయన తెలిపారు. ఈ తరహాలో ప్రమాదానికి గురైన 504 మందికి ఒక్కోక్కరికి ఐదు లక్షల చొప్పున 8.9 కోట్లు చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. మొదటి నుండి మహిళా పక్షపాతిగా పేరు బడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక రంగంలోనూ మహిళలకు బాసటగా నిలుచున్నారన్నారు.మహిళా కార్మికుల పిల్లల పెండ్లిళ్లకు 30,000 రూపాయలు కానుకగా అందిస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు 46,638 మందికి 130 కోట్లు వెచ్చించిందని ఆయన తెలిపారు. అంతటితో ఆగని ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ కార్మికులకు ప్రసూతి ఖర్చుల కింద ఒక్కొక్క మహిళా కార్మికురాలికి 30 వేల రూపాయలు ఇస్తున్నారన్నారు.ఇప్పటి వరకు 101983 మంది మహిళా కార్మికులకు ప్రసూతి ఖర్చుల కింద ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పెట్టిన ఖర్చు 283 కోట్లని ఆయన వెల్లడించారు.కరోన వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులను ఆదుకున్నారని ఆయన కొనియాడారు. కోవిడ్-19 సమయంలో కార్మికుల కోసమే ప్రత్యేకించి పెట్టిన ఖర్చు 1005 కోట్లని ఆయన గుర్తు చేశారు. కార్మికుల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలు చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని ఆయన కొనియాడారు. సూర్యపేటలో కార్మికుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన అని ఆయన ప్రకటించారు.కార్మికుల కోసం కొత్త రాష్ట్రంలో ఇటువంటి విప్లవాత్మక మైన మార్పులను తీసుకుని కార్మికులు,కార్మికుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలబడితే మోడీ సర్కార్ నిర్ణయాలు కార్మిక రంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గుజరాత్ లో కార్మిక సంఘాల నిషేధమే ఇందుకు నిదర్శనమన్నారు.కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బిజెపి ఆధ్వర్యంలోనీ కేంద్రప్రభుత్వం పై తిరుగుబాటుకు సన్నద్ధం కావాలని కార్మికులకు మంత్రి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ,జిల్లా గ్రంధాలయా చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు,జిల్లా నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ నెమ్మాది బిక్షం , జడ్పిటిసి జిడిబిక్షం, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, కౌన్సిలర్లు ,నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.