Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయం ముందు ఎర్రజెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి నల్లాల బావి సెంటర్ వాణిజ్య భవన్, శంకర విలాస్ సెంటర్ మార్కెట్ రోడ్, పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా గాంధీ పార్క్ వరకు ప్రజా ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అనంతరం గాంధీ పార్క్ లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు అధ్యక్షతన మేడే సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మల్లు లక్ష్మి మాట్లాడుతూ శ్రమ దోపిడికి వ్యతిరేకంగా వేలాదిమంది కార్మికులు ఐక్యంగా ఎనిమిది గంటల పని దినం కోసం పోరాటాలు నిర్వహించారని తెలిపారు.చికాగో నగరంలో జరిగిన కార్మికుల పోరాట స్ఫూర్తితో అనేక దేశాల్లో కార్మిక వర్గ పోరాటాలు ఉదృతంగా జరిగాయని తెలిపారు. శ్రామిక జనావళి విముక్తి మార్గానికి ఎర్రజెండానే మార్గదర్శక మని ఆమె అన్నారు కార్మికుల పక్షాన నిరంతరం పోరాడుతున్న జెండా ఎర్రజెండా తప్ప మరోటి లేదన్నారు. నాటి మేడే పోరాట స్ఫూర్తితో నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాల పైన సంఘటితంగా ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కార్మిక వర్గంపై తీవ్రమైన దాడి నిర్వహిస్తుందన్నారు. కార్పొరేట్ల మేలు కోసం ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా పెట్టుబడిదారులకు కట్టబెడుతుందని విమర్శించారు. కార్మిక లేబర్ కోడులు తీసుకొచ్చి కార్మికులకు హక్కులు లేకుండా సమ్మెలు చేయకుండా కార్మికులను నిర్బంధాలకు గురిచేస్తుందన్నారు. దేశంలో పాలకులు ప్రజా సమస్యలు పట్టించుకో కుండా కుల మతాల పేరుతో విభజన చిచ్చు పెెడుతోందన్నారు. పోరాడి సాధించుకున్న చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుస్తూ కార్మికులకు యూనియన్ లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. ఎంతోమంది కార్మికులు తమ రక్తాన్ని ధారపోసి పోరాడి సాధించుకున్న చట్టాల అమలు కోసం మరిన్ని పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు ఏలుగూరి గోవిందు, దండా వెంకటరెడ్డి ,మేకనబోయిన శేఖర్ ,చినపంగి నరసయ్య, మేకనబోయిన సైదమ్మ ,కొప్పుల రజిత, వీరబోయిన రవి, ధనియాకుల శ్రీకాంత్, పట్టణ మండల కార్యదర్శి ఆవిరి అప్పయ్య, బత్తుల వెంకన్న, రణపంగ కష్ణ,బచ్చలకూరి రామ్ చరణ్, పార్టీ నాయకులు సాయికుమార్, మామిడి సుందరయ్య, శశిరేఖ, భాగ్యమ్మ ,ఉయ్యాల నగేష్, కంచు గట్ల శ్రీనివాస్ ,బోల్ల నాగేందర్ రెడ్డి ,యాదగిరి, నారాయణ వీరారెడ్డి, వెంకటేశ్వర్లు, వినోద్ ,బచ్చలకూరి రాంబాబు, ప్రవీణ్, సోమన్న, చిత్రం భద్రమ్మ, పిట్టల రాణి తదితరులు పాల్గొన్నారు.