Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ - భువనగిరి
దోపిడీదారుల దురాగతాలకు వ్యతిరేకంగా శ్రామికులు పిడికిలెత్తిన రోజు మేడే అనిసీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శి ఎండి. జహంగీర్ అన్నారు. సోమవారం మేడే సందర్భంగా స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన జెండాను ఎగురవేసి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ప్రతి ఏటా లక్షల కోట్ల రాయితీలు కట్టబెడుతూ, ప్రజలపై బారాలు చేస్తున్నదన్నారు .దేశమంటే అంబానీ , అదానిలా సొత్తుగా మార్చుతున్నదన్నారు. గ్యాస్ ,పెట్రోల్ ,డీజిల్ తో సహా అన్ని రకాల వస్తువుల ధరలు అడ్డగోలుగా పెంచిందన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు రూ .15 లక్షల పేదల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, ధరలు తగ్గిస్తామని తదితర హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందన్నారు. పోరాడి కార్మికులు సాధించుకున్న హక్కులు నేడు పెట్టుబడిదారులు వారి తొత్తులుగా పనిచేస్తున్న పాలకవర్గాల కబంధహస్తాలలో నలిగిపోతున్నాయని విమర్శించారు. కష్టజీవుల శ్రమకు సరిపడా వేతనం ఇచ్చే యాజమాన్యాలు లేవని తెలిపారు. శ్రమ చేసిన వారికి హక్కులు కల్పించే పాలకులు లేరన్నారు. రాజ్యాంగం కార్మికులకు ఎన్నో చట్టాలను కల్పించినప్పటికీ ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. వామపక్షాల ఆధ్వర్యంలో పోరాటాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేయగా కార్మికులకు కొన్ని హక్కులు కల్పించారని చెప్పారు. పశ్చిమబెంగాల్, కేరళ ,త్రిపుర రాష్ట్రాలలో మాదిరిగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి చట్టం చేయాలని వామపక్షాలు పోరాటాలు చేశాయని కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదన్నారు .కార్మికులంతా ఐక్యంగా ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు వ్యతిరేకంగా మేడే స్ఫూర్తితో పోరాడి హక్కుల సాధనకు ఉద్యమించాల్సిన అవసరమైన ఎంతైనా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్ , కల్లూరి మల్లేశం దాసరి పాండు,జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్, నాయకులు గద్దె నరసింహ, బోడ భాగ్య ,గంధ మల్ల మాతయ్య, ఈర్లపల్లి ముత్యాలు, వడ్డెబోయిన వెంకటేష్ ,వల్దాస్ అంజయ్య, గీస అంజయ్య పాల్గొన్నారు.