Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున
నవతెలంగాణ-నల్లగొండ రూరల్
ఐకేపి కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు లారీల కొరత ప్రధాన అవరోధంగా మారిందని, జిల్లా కలెక్టర్ వెంటనే దీనిపై దృష్టి సారించి తగిన లారీలతో ఎగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. బుధవారం పాలడుగు బృందం నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన కంచనపల్లి ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు సమస్యలను, రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యంను రైతులు ఐకేపీ కేంద్రాలలో పోసి కొనుగోలు కోసం కండ్లు కాయలు కాసేలా చూసే పరిస్థితి దాపురించింద న్నారు. ఐకేపీ కేంద్రాల్లో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నప్పటికీ తీవ్రమైన లారీల కొరత వలన రోజుకు ఒక లారీ బస్తాలు కూడా తరలించే పరిస్థితి లేదని, లారీల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు జయలక్ష్మి మాట్లాడుతూ పండించిన పంటను ఐకేపీల్లో నెల రోజులుగా నిల్వ ఉంచామని, తీవ్రమైన వర్షాలకు మొలకెత్తే ప్రమాదం ఉందని, కాంటా పెడుతున్నప్పటికీ లారీల కొరత సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో తీవ్రంగా లారీలా కొరత ఉందని క్రమ పద్ధతిలో ట్రాక్టర్లు కూడా అనుమతించి ధాన్యాన్ని తరలించాలని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, పద్మారెడ్డి, గడ్డం నవీన్, కట్ట లింగయ్య, మద్దిరాల లింగారెడ్డి, సూరి కట్టా లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.