Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే సమ్మెను ఉధృతం చేస్తాం
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఐకేపీ, వీఓఏలను సెర్ఫు ఉద్యోగులుగా గుర్తించాలని, అప్పటి వరకు రూ.26 వేల కనీస వేతనం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐకేపీ, వీఓఏల రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండివైఖరి నిరసిస్తూ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం నల్లగొండ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో సుమారు 18 వేల మంది వీవోఏలు గ్రామ సంఘాలకు సహాయకులుగా 19 సంవత్సరాల నుండి అనేక కష్టనష్టాలకోర్చి రూ.3,900 వేతనంతో పని చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల మీద ఆశతో వేతనాలు పెరుగుతాయని, ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని 9 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాసేలాగా చూసి గత్యంతరం లేకనే సమ్మెలోకి వెళ్ళారని పేర్కొన్నారు. ఇప్పటికీ 17 రోజులు గడుస్తున్నా ప్రభుత్వానికి కనీసం చలనం లేదని విమర్శించారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించి 10 లక్షల ఆరోగ్యం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, సెర్ఫ్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలని, అర్హత కలిగిన వారిని సీసీలుగా నియమించాలని డిమాండ్ చేశారు. వీవోల గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని వేతనాలు నేరుగా వీవోఏ ల ఎకౌంట్లలో వేయాలని కోరారు. వీవోఏల సమస్యలను తక్షణం పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణచారి, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, జిల్లా నాయకులు పోలె సత్యనారాయణ, బీ.గణేష్, అద్దంకి నరసింహ, తెలంగాణ ఐకెేపీ, వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) జిల్లా అధ్యక్షులు కె.శరత్, జిల్లా నాయకులు ఎస్కే. సైదాబీ, ఐకేపీ, బీఆర్టీయూ నాయకులు సిహెచ్.దుర్గయ్య, లక్ష్మీ, పాపయ్య సులోచన, సీఐటీయూ యూనియన్ నాయకులు టీ. రాందాస్, జంగయ్య, అహల్య, నగేష్ తదితరులు పాల్గొన్నారు.