Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
డిండి ఎత్తి పోతల పథకం కింద శివన్నగూడెం రిజర్వాయర్ సంబంధించి ముంపుకు గురైన నర్సిరెడ్డి గూడెం నివాసిత గ్రామస్థులకు చింతపల్లి గ్రామంలో పునరావాసం కల్పించడానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులతో కిష్టరాయపల్లి రిజర్వాయర్, శివన్నగూడెం రిజర్వాయర్, ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్, అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు, శివన్నగూడెం నర్సిరెడ్డి గ్రామ నిర్వాసితులకు అర్ అండ్ ఆర్ ప్యాకేజీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివన్నగూడెం ప్రాజెక్ట్ నర్సిరెడ్డి గ్రామస్థులకు చింతపల్లి గ్రామంలో భూ సేకరణ పూర్తయినందున ఆ భూములను ఇరిగేషన్ శాఖకు అప్పగించాలని అధికారులకు సూచించారు. పునరావాసం కల్పించడానికి చింతపల్లి గ్రామంలో లేఅవుట్ వేసి ఫ్లాట్ చేయాలని అధికారులకు చెప్పారు. ఆ ప్రాంతంలో అన్ని శాఖల అధికారులను భాగస్వాములను చేసి అన్ని మౌలిక సౌకర్యాలతో అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూ సేకరణ ఇరిగేషన్ రిక్విజేషన్ ఎంత ఇచ్చారు, ఇప్పటివరకు జరిగిన పనుల ప్రగతి వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పనులు జరిగిన దానికి ఎంత నష్టపరిహారం చెల్లించారు, ఇంకా ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంది అనే విషయాలపై చర్చించారు. అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా జరిగిన భూసేకరణ పనులలో జాప్యం జరగకుండా వెంటనే పూర్తి చేయుటకు సంబంధిత ఏజెన్సీ వారితో పెగ్ మార్కింగ్ వారం రోజులలో పూర్తి చేయించాలని సంబంధిత అధికారులను, ఇంజనీర్లను కలెక్టర్ ఆదేశించారు. భూసేకరణ పూర్తి అయిన దగ్గర వెంటనే పనులు జరిగేలా ఆర్డీవోలు తహశిల్దార్ లను సమన్వయం చేసి పర్యవేక్షించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) భాస్కరరావు, భూ సేకరణ ప్రత్యేక కలెక్టర్ ఎల్ఏ, అర్ అండ్ అర్ యూనిట్ 1 రోహిత్ సింగ్, ఆర్డీఓ లు జయచంద్రారెడ్డి, గోపి రామ్ నాయక్, ఇరిగేషన్, అర్డబ్ల్యూఎస్, అర్ అండ్‌బీ ఇంజనీర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.