Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
మన ఊరు - మన బడి, మన బస్తీ - మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మొదటి విడత చేపట్టిన పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్భుగుప్తాతో కలిసి పీఅర్, అర అండ్‌బీ, ఆర్డబ్ల్యూఎస్, విద్య, మౌలిక వసతులశాఖ ఈఈలు, డీఈలు, ఏఈలు, ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మన ఊరు - మన బడి, మన బస్తీ - మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన పాఠశాల ల్లో పనుల పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మొదటి విడత ఎంపిక చేసిన 517 పాఠశాలల్లో 32 పాఠశాలలు మాత్రమే పనులు పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందని, చిన్న చిన్న పనులు పెండింగ్ ఉంటే త్వరగా పూర్తి చేసి ప్రజా ప్రతినిధులను సంప్రదించి మిగతా పాఠశాలలు అన్ని కూడా ప్రారంభించాలన్నారు. మండలాల వారీగా జిల్లా కలెక్టర్ పనులు సమీక్షించి ఆయా ఇంజనీరింగ్ అ ధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 30 పా టశాలల్లో పెయింటింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, పెయింటింగ్ పనులు పూర్తి చేసి పాఠశాలలు ప్రారంభం చేయాలని చెప్పారు. కొన్ని పాఠశాలల్లో మొదలు పెట్టిన పనులు పురోగతి లేదని, వెంటనే ప్రతి పాఠశాలలో ప్రతి రోజు పనులు జరగాలని ఆదేశించారు. 30 లక్షలలోపు పనులు పాఠశాల యాజమాన్య కమిటీలు త్వరగా పూర్తి చేయాలని, 30 లక్షల పై బడి ఉన్న పనులు టెండర్ పూర్తి కానివి వుంటే వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఈజీఎస్ కాంపోనెంట్ కింద చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ
జిల్లాలోని తిప్పర్తి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ టీి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పరిమాణం ఎంత వుంది ఎంత పరిమాణంలో కొనుగోలు చేశారు. ట్యాబ్ ఎంట్రీ,చెల్లింపులు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం రవాణాకు లారీలు వస్తున్నాయా, తదితర విషయాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం, నాణ్యత ప్రమాణాలు పరిశీలించి ధాన్యం తూకం వేసి మిల్లులకు పంపించాలని ఆదేశించారు. ఏ.దుప్పలపల్లిలో సాయి వెంకటేశ్వర రైస్ మిల్లును తనిఖీ చేసి సెంటర్ నుండి రవాణా చేసిన ధాన్యం అన్ లోడింగ్ పరిశీలించారు. అన్ లోడింగ్ పాయింట్ అదనంగా ఏర్పాటు చేసి హమాలీలను పెంచి ధాన్యం త్వరితంగా అన్ లోడింగ్ చేసుకోవాలని మిల్లు యజమానిని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల డీఎం నాగేశ్వరరావు, జిల్లా ఇన్చార్జి సహకార అధికారి శ్రీనివాస్, తహశీల్దార్ కృష్ణయ్య తదితరులు ఉన్నారు.