Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కట్టిన బ్రిడ్జినే కడుతూ ప్రజాధనం దోపిడి
- మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టంలోని 38, 36వ వార్డు ఎరకల బజారు నాలాపై 2012లో మున్సిపల్ నిధులతో వంతెన ప్రారంభించి 80 శాతం పనులు పూర్తి చేశారు. కాగా ఆ వంతెనపై ఇప్పుడు బ్రిడ్జి నిర్మించడానికి రూ.25 లక్షలు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. వార్డు ప్రజల, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోడిరెక్క శౌరి, కోడిరెక్క ఇంద్రకుమార్ ఆరోపణల మేరకు కాంగ్రెస్ కౌన్సిలర్లు, నేతలతో కలిసి శనివారం ఆయన బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు మూడు లక్షలతో వంతెన పూర్తయ్యే అవకాశం ఉండగా గతంలో చేసిన పనులకు సైతం ఎస్టిమేట్ వేసి వంతెన నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచి ప్రజాధనాన్ని కాంట్రాక్టుల పేరా దోచుకునేందుకు అధికార నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. 38వ వార్డు కాంగ్రెస్ నాయకులు వంతెన నిర్మాణ వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినప్పటికీ స్పందించకపోగా తక్షణమే 8 రోజుల్లో వంతెన పనులు పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్ని మున్సిపల్ కమిషనర్ ఆదేశించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. మున్సిపల్ చైర్మెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులోనే ఇలాంటి కార్యక్రమాలు సాగడం దురదృష్టకరమన్నారు. మొత్తం వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి వంతెన నిర్మాణం తగ్గించి పూర్తి చేసే విధంగా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ చిలుకురి బాలు, నాగు నాయక్ కౌన్సిలర్లు జానీ పాష, గుంజ శ్రీను, లావురి రవినాయక్, మౌయిజ్, బ్లాక్ కాంగ్రెస్ తమ్మడబోయిన అర్జున్, పొలగాని వెంకటేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సిద్దు నాయక్ తదితరులు పాల్గొన్నారు.