Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ కే.అపూర్వరావు
నవతెలంగాణ-నల్లగొండ
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కే.అపూర్వరావు అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ కోసం నేషనల్ హైవే, స్టేట్ హైవేల పైన బ్లాక్ స్పాట్స్ వద్ద తీసుకోవలసిన తక్షణ చర్యలు మొదలగు అంశాలపై జిల్లా ఎస్పీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే యాక్సిడెంట్ ఫ్రోన్, బ్లాక్ స్పాట్ ఏరియాలను గుర్తించి వాటి నివారణకు తీసుకోవాల్సిన ప్రణాళిక చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రధాన చౌరస్తాలో రేడియం స్టిక్కర్లతో కలిగిన భారీ కేడ్లను ఏర్పాటు చేయాలని, బ్లాక్ స్పాట్స్ వద్ద, కీలకమైన కూడళ్ళ వద్ద లైటింగ్ పెంచాలన్నారు. స్పీడు నియంత్రణ కోసం మలుపుల దగ్గర సూచికలు, బ్లింకింగ్ లైట్స్, బోలర్స్ ఏర్పాట్లు, తదితర విషయాలను వివరించారు. వాహనదారులకు ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించి రోడ్డు భద్రత పట్ల చైతన్య పరచాలని తెలిపారు. ప్రమాదాల నివారణ కొరకు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని తగిన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ శేషాద్రినిరెడ్డి, నల్లగొండ డీఎస్పీ నరసింహరెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, దేవరకొండ డీిఎస్పీ నాగేశ్వరరావు, డీసీఆర్బీ రమేష్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
పోలీస్ కుటుంబాలకు ఆర్థిక భరోసా
అనారోగ్యంతో మరణించిన కుటుంబానికి భద్రతా చెక్కు
జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ విభాగంలో పనిచేస్తూ అనారోగ్య కారణంగా మరణించిన హెడ్ కానిస్టేబుల్ జే.బాలునాయక్ సతీమణి పద్మకి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ.7,74,292 భద్రతా చెక్కును ఎస్పీ కే.అపూర్వరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏవో మంజు భార్గవి, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, సోమయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.