Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
పురుషోత్తంరెడ్డి మరణం సీపీఐ(ఎం) ప్రజా ఉద్యమాలకు తీరని లోటని, ఆయన సేవలు మరవలేనివని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. శనివారం సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు మాలి పురుషోత్తంరెడ్డి రెండో వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. పురుషోత్తం ధనిక రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ పేద, మధ్యతరగతి రైతాంగ సమస్యలపై, వ్యవసాయ కార్మిక సమస్యలపై అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. విద్యార్థి దశలోనే వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితులై విద్యార్థి యువజన సంఘాలకు నాయకుడిగా అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారని చెప్పారు. 1970లో పార్టీ సభ్యుడిగా చేరి నాటి నుంచి చనిపోయే వరకు కూడా కూలి రేట్లు, భూ సమస్యలపై, విద్యుత్తు, సాగర్ ఎడమ కాలువ లిఫ్టులపై అనేక పోరాటాలు చేశారని, రైతాంగం పండించిన పంటలకు మద్దతు ధర వచ్చేవరకు ప్రజలను సమీకరించి ఉద్యమాలను చేశారని, ఆనాడు ఆయన చేసిన అనేక సేవలను కొనియాడారు. పురుషోత్తంరెడ్డి సల్కునూరు సింగిల్ విండో చైర్మెన్‌గా, వేములపల్లి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారని తెలిపారు. 2005లో తూటి దేవేందర్‌రెడ్డిపై అత్యధిక మెజార్టీతో వేములపల్లి ప్రజలు గెలిపించారని చెప్పారు. గెలిపించిన ప్రజలు రుణం తీర్చుకోవడానికి అనేక సమస్యల్ని పరిష్కరించడం కోసం కృషి చేశారని చెప్పారు. మచ్చలేని మార్క్సిస్టు పార్టీ నాయకుడిగా నమ్మిన సిద్ధాంతం కోసం తుద వరకు పాటుపడ్డారని, ఆశయ సాధన కోసం యావత్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారీ ఐలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సయ్యద్ హశం, ఎండీ. సలీం, పీ.నర్సిరెడ్డి, దండం పల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, కొండ ఎంకన్న, సరోజ, పూల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.