Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ కాలం పూర్తయిందని, వారి న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్ ముందు పంచాయతీ కార్యదర్శుల సమ్మె శిబిరాన్ని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు బండా శ్రీశైలం, పీ.నర్సిరెడ్డిలతో కలిసి సందర్శించి సంఘీభావం, సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 2019 ఏప్రిల్ నుండి వివిధ గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్నారని, నోటిఫికేషన్ ప్రకారం ప్రొబేషన్ కాలం ఏప్రిల్ 2022కే పూర్తయ్యిందని తెలిపారు. అయినా మరొక్క సంవత్సరం పెంచుతూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని, ఈ గడువు కూడా 11ఏప్రిల్ 2023తో ముగిసిందని, ఎందుకు రెగ్యులర్ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యదర్శులతో సుమారు 42 రకాల పనులను చేయిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థ ఉండకూడదన్న ముఖ్యమంత్రి నాలుగేళ్ళ ప్రొబేషన్ గడువు పూర్తయినప్పటికీ రెగ్యులరైజ్ చేయకపోవడం బాధాకరమన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని గుర్తు చేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో వివిధ గ్రామాలకు అనేక అవార్డులు తీసుకురావడంలో వీరి పాత్ర గణనీయంగా ఉందన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన వీరి న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సమస్యని రాష్ట్ర ప్రభుత్వం జటిలం చేస్తే పంచాయతీ కార్యదర్శులు చేసే ప్రతి ఉద్యమంలో సీపీఐ(ఎం) ముందుండి పోరాడుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులనందరినీ జేపీఎస్‌లుగా ప్రమోట్ చేస్తూ పని చేసిన కాలాన్ని ప్రొబేషన్ పీరియడ్‌లో భాగంగా పరిగణించి రెగ్యులరైజ్ చేయాలన్నారు. జీవో నంబర్ 317 వల్ల నష్టపోయిన పంచాయతి కార్యదర్శులకు న్యాయం చేయాలి. పరస్పర బదిలీలు, స్పౌస్ బదిలీలకు అవకాశము కలిపించాలని డిమాండ్ చేశారు. జేపీఎస్‌లు చేసే నిరవధిక సమ్మెకు టీఎస్ యూటీఎఫ్ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్డ సైదులు, జిల్లా కార్యదర్శులు జీ.నర్సింహా, నలపరాజు వెంకన్న, నల్లగొండ మండల బాధ్యులు చిప్పలపల్లి సైదులు, పలువురు జూనియర్, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.