Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోత్కూర్:రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనకపోవడంతో అకాల వర్షాలతో కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి మొలకెత్తిందని, ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, ఆలిండియా వీవర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ వనంశాంతికుమార్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు.మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆపార్టీ ఆధ్వర్యంలో సందర్శించి ధాన్యం రాశులను పరిశీలించి రైతులను ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం రాశులు తడిసి మొలకెత్తాయని, ధాన్యం రంగు మారుతుందని తెలిపారు. రాశులపై కప్పడానికి రైతులకు టార్పాలిన్లు కూడా సరిగా అందించలేకపోవడం ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనమని విమర్శించారు. ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసిన స్థలం ఎత్తుపల్లాలు ఉండడంతో వర్షానికి ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయిందన్నారు.ధాన్యం తడిసి సకాలంలో కొనకపోవడంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు పడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ధాన్యం పోసిన స్థలం ఎత్తుపల్లాలుగా ఉండడంతో ధాన్యం అంతా వరద నీటిలో కొట్టుకపోవటంతో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.సకాలంలో కొనుగోలు జరగకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, మండల కమిటీ సభ్యులు రాచకొండ కనకయ్య, మండల కమిటీ సభ్యులు కురిమేటి యాదయ్య, రైతులు శీల అంజమ్మ, నాగపురి నాగమ్మ, దొండ ఇస్తారి, నాగరాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.