Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా అధ్యక్షుడు యాదగిరి
నవతెలంగాణ-మోత్కూర్
ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని అనాజిపురం గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించి కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో కూలీలు మండే ఎండలో చెమటోడ్చి పని చేస్తున్నారని, పని ప్రదేశంలో అధికారులు నీడ, మంచి నీరు లాంటి ఎలాంటి సదుపాయాలు కల్పించకపోయినా పని చేస్తున్నారని, ఎక్కువ గంటలు పని చేయించడంతో కూలీలు అనారోగ్యానికి గురై పని ప్రదేశంలో సొమ్మసిల్లి పోతున్నారని తెలిపారు. వారం రోజులకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా మూడు నెలలు గడుస్తున్నా వేతనాలు చెల్లించకపోవడం లేదన్నారు. నెలల తరబడి కూలీ డబ్బులు చెల్లించకుంటే కూలీలు కుటుంబాలను ఎలా పోషించుకుంటారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడానికే ఇలాంటి ఇబ్బందులను సృష్టిస్తున్నాయని ఆరోపించారు. కూలీలకు రోజు కూలి పెంచడంతోపాటు పని దినాలలో పెంచాలని, చేసిన పనికి కూలీలకు వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మెతుకు అంజయ్య, పూజారి చంద్రకళ, వరికుప్పల మంగ, బుచ్చమ్మ, ముత్తమ్మ , కొల్లు నర్సయ్య, వరికొప్పుల వెంకన్న, కొల్లు మమత, ఎల్లమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.