Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో ప్రభుత్వం చర్చలు జరపాలి
- నేడు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసనలు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-చౌటుప్పల్
ప్రజాస్వామ్యయుతంగా హక్కుల సాధన కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెను విచ్చిన్నం చేసే ప్రభుత్వ చర్య సరికాదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. మంగళవారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ప్రజాసంఘాల జిల్లాస్థాయి సమావేశం సీపీఐ(ఎం) రాష్ట్రకమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జహంగీర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేసి సమస్యలు పరిష్కరించాలని పది రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని, లేనిపక్షంలో ఉద్యోగాల నుండి తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడం సరికాదన్నారు. నాలుగు సంవత్సరాలుగా గ్రామాల్లో అనేక ఒత్తిళ్లు, ఆటుపోట్లు ఎదుర్కొని విధులు నిర్వహిస్తూ రెగ్యులరైజ్ కాక విధి లేని పరిస్థితుల్లో సమ్మెకు దిగిన పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించి చేయకపోవడంతో కార్యదర్శులు వెట్టిచాకిరి చేస్తూ మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఏ ఉద్యోగానికి లేని ప్రొబేషనరీ కాలం ఈ ఉద్యోగానికే ఎందుకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యయుతంగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను బెదిరింపులకు గురిచేయకుండా చర్చలు జరపాలన్నారు. పంచాయతీ కార్యదర్శులకు మద్ధతుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఈ నెల 10న జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మండలకేంద్రంలో ఎంపీడీఓలకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లాకమిటీ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి, ఎమ్‌డి.పాషా, బండారు నర్సింహా, జల్లెల పెంటయ్య, సిర్పంగి స్వామి, బొడ్డుపల్లి వెంకటేశం, గుంటోజు శ్రీనివాస్‌చారి, చీరిక అలివేలు, వనం ఉపేందర్, మొరిగాడి రమేశ్, నాయకులు చీరిక సంజీవరెడ్డి, రాగీరు కృష్ణయ్య, ఈర్లపల్లి ముత్యాలు, నందీశ్వర్, పల్లె మధుకృష్ణ, బొజ్జ బాలయ్య పాల్గొన్నారు.