Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమాలకు ఊపిరి పోసిన అంజన్న
- చౌటుప్పల్‌లో సీపీఐ(ఎం) బలోపేతానికి కీలకపాత్ర
- కడవరకు పేదల కోసమే పోరాటం
నవతెలంగాణ-చౌటుప్పల్
ఉద్యమాలకు పురిటిగడ్డ కమ్యూనిస్టుల కంచుకోట పంతంగిలో జన్మించిన అంజన్న వ్యవసాయ కూలీలకు ఉద్యమ సూర్యునిగా నిలిచి అమరుడై ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడు.చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో రొడ్డ సాయన్న-లక్ష్మమ్మ దంపతులకు 1959 అక్టోబర్ 29న నాల్గో సంతానం చిన్న కుమారుడు అంజన్న జన్మించాడు. తండ్రి సాయన్న నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి. సాయన్న సైతం పేద ప్రజల కోసం భూస్వాములు, పెత్తందారులకు వ్యతిరేకంగా నిర్వహించిన పోరాటాల్లో చురుకుగా పాల్గొనేవాడు. చిన్నకుమారుడైన అంజయ్య పెద్ద సోదరుడు లక్ష్మీపతి ఆనాటి అమరజీవి కామ్రేడ్ కందాల రంగారెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారు. అంజన్నను ఉన్నత విద్యావంతున్ని చేయాలనే ఆశయంతో ఎంతో కష్టనష్టాలకోర్చి నల్లగొండలోని హాస్టల్లోనే ఉంటూ ఎస్ఎస్సీ, ఐటిఐ వరకు అంజన్నను చదివించాడు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే విద్యార్థి ఉద్యమాలకు ఆకర్షితుడయ్యాడు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహించారు. ఐటీఐ పూర్తికాగానే హైద్రాబాద్‌లోని ఓ ప్రయివేట్ పరిశ్రమలో ఉద్యోగిగా చేరాడు. కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. కానీ అతని మనసు పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఉండేది. 1982 సంవత్సరంలో రాములమ్మతో వివాహం జరిగింది. అంజయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 1987లో ఉద్యోగాన్ని వదిలివేసి గ్రామానికి వచ్చాడు. అప్పటి నుండే ప్రజా ఉద్యమాలే ఊపిరిగా పనిచేశారు. 1992 నుండి 1995 వరకు ఎస్.లింగోటం సింగిల్‌విండో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో నిత్యం రైతులకు అందుబాటులోఉంటూ అనేక విధాలుగా రైతులకు ఆదుకున్నారు. వందలాది మంది రైతులకు రుణాలు అందించి రైతుల మన్ననలు పొంది, రైతు పక్షపాతిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. చౌటుప్పల్ మండల సీపీఐ(ఎం) కార్యదర్శిగా 2000 సంవత్సరం నుండి 2011 వరకు మూడు పర్యాయాలు ఏకధాటిగా పనిచేశారు. ఈ ప్రాంతంలో సీపీఐ(ఎం) బలోపేతం తనదైన ముద్ర వేశారు. కామ్రేడ్ కందాల రంగారెడ్డి స్మారక భవన నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించారు. కుటుంబంతో కార్యాలయంలోనే నివసిస్తూ 24 గంటలు కార్యకర్తలకు అంజన్న అందుబాటులో ఉండేవారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అంజన్న ఉంటాడనే ధైర్యం ఉండేది. రంగారెడ్డి హత్య అనంతరం జరిగిన గొడవల్లో అంజన్నను బాధ్యున్ని చేస్తూ కేసులు పెట్టారు. రెండుసార్లు జైలు జీవితం గడిపాడు. మొదటిసారి 23 రోజులు, రెండోసారి 15 రోజులు జైలులో ఉన్నాడు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యునిగా, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర కమిటీ సభ్యునిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా వ్యవసాయ, ఉపాధిహామీ కూలీలకు వెన్నుదన్నుగా నిలిచాడు. వ్యవసాయ కూలీలను ఏకం చేసి ఉద్యమాలకు ఊపిరిపోశాడు. అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం అంజన్న నిరంతరం తపించేవాడు. ఈ క్రమంలో సంగారెడ్డిలో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర విస్తతస్థాయి సమావేశాలకు ఆయన హాజరయ్యాడు. సమావేశం రెండో రోజు గుండెపోటు రావడంతో సమావేశం ప్రాంగణంలోనే అంజన్న కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి అంజన్నను తరలించగా 2022, మే 12న తుదిశ్వాస విడిచాడు. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు, వ్యవసాయ కూలీలు, గీత కార్మికుల గుండెల్లో అంజన్న చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎర్రజెండాను ప్రాణంగా భావించే అంజన్న తన కుమార్తెలకు, కుమారునికి విప్లవ నాయకుల పేర్లు పెట్టాడు. కుమారుని పేరు భగత్‌సింగ్, కుమార్తెల పేర్లు స్వరాజ్యం, విప్లవజ్యోతి పేర్లు పెట్టుకొని ఎర్రజెండాపై మమకారం చాటాడు అంజన్న.