Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ దీపక్ తివారి
- జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ప్రభుత్వ నిర్దేశిత రేటు ప్రకారం కనీస వేతనం పడే విధంగా కూలీలతో పని చేయించాలని, కూలీలకు సకాలంలో వేతనం చెల్లించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, అసిస్టెంట్ ఇంజనీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లతో గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న కూలీలకు పనులు కల్పించాలని, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాలలో నిర్మించిన వైకుంఠధామాలలో నీరు, కరెంటు సౌకర్యం కల్పించాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా మురుగునీటి నిర్వహణపై అర్హత కలిగిన ఇళ్లకు ఇంకుడు గుంతలు నిర్మించాలని, ఓడిఎఫ్ కోసం అన్ని గ్రామాలలో మూడు రకాల వాల్ పెయింటింగ్ వేయాలన్నారు. ఇప్పటికే దేశంలో కెలా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గ్రామాలు ఓడిఎఫ్ కింద డిక్లేర్ చేసినందున, సిబ్బందిని అభినందించారు. నీటిపారుదల శాఖ సమన్వయంతో సంపద వనాలలో భాగంగా మొక్కలు నాటుటకు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అసిస్టెంట్ ఇంజనీర్స్ జాయింట్ వెరిఫికేషన్ నిర్వహించి, అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. సీఎం కప్పు క్రీడల పోటీలు మండల కమిటీ ఆధ్వర్యంలో అన్ని మండలాలలో ఈ నెల 15 నుంచి 16 , 17 తేదీలలో నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో సిహెచ్ కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి టి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహ, పశుసంవర్ధక శాఖ అధికారి కృష్ణ, డివిజనల్ పంచాయతీ అధికారి యాదగిరి, జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, అసిస్టెంట్ ఇంజనీర్స్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ లు, స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కన్సల్ టెంట్స్ పాల్గొన్నారు.