Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యేటేటా పెరుగుతున్న వినియోగం
- ఆదా అవుతున్న కరెంట్
- కొనుగోళ్లకు వినియోగదారుల మొగ్గు
చలికామైనా, వేసవికాలమై, వర్షాకాలమైనా ఉదయం నిద్రలేవగానే మొట్టమొదటగా కొందరు వేడినీళ్ల కోసం హీటర్ పెట్టడం సహజం. నెల గడిచేసరికి తీరా కరెంట్ బిల్లు చూసుకుంటే తడిసిమోపెడవుతోంది. అందుకనే చాలామంది ఎలక్ట్రానిక్ వాటర్ హీటర్స్కు బదులు సోలార్ హీటర్లను వినియోగించేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో యేటేటా వీటి అమ్మకాలు ఊపందుకుంటున్నాయి.వీటి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభు త్వాలు ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాయి. ఇటీవలి కాలంలో సామాన్యులకు ఇవి అందుబాటులోకి వచ్చాయనే చెప్పాలి. అయితే వీటి వినియోగంలో కొన్ని మెళకువలు పాటిస్తే సరి..అవేంటో తెలుసుకుందామా మరీ..!
నవతెలంగాణ-నల్లగొండ డెస్క్
జిల్లాలో యేటా సోలార్ వాటర్ హీటర్ల వినియోగం పెరు గుతూ వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇంటి పైకప్పుల మీద ఇవి దర్శనమిస్తుంటాయి. విద్యుత్ హీటర్ల కంటే సోలార్ హీటర్లే అత్యంత సురక్షితమైనవి. నిజానికి ఒకవ్యక్తి స్నానం చేయడానికి పది నుంచి ఇరవై లీటర్ల నీరు అవసరం. 60 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ వేడినీళ్లు కావాలి. అందులో చన్నీళ్లని కలుపుకొని స్నానం చేయొచ్చు. సోలార్ హీటర్ ఈ పనిని సులువుగా చేసిపెడుతుంది. ఇంట్లో సోలార్ వాటర్ హీటర్ ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. వీటి విని యోగం వల్ల ఆర్థికంగా చాలా లాభం ఉంటుంది. మార్కెట్లో సోలార్ వాటర్ హీటర్లు ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ల కంటే కాస్త తక్కువగానే అందుబాటులో దొరుకుతున్నాయి. గ్యాస్, వాటర్ హీటర్లతో పోలిస్తే ఇవి చాలా చవకగా లభిస్తాయి. చాలామంది ఇండ్లు కట్టుకునే సమయంలో ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లనే ఉపయోగిస్తుంటారు. అందుకు ప్రధాన కారణం వాటిని అమర్చడానికి తక్కువ సమయం పట్టడమే. అందుకనే వీటిని ఎక్కువగా వాడుతుంటారు. ఓ సాధారణ ఇంట్లో నీటిని ఎలక్ట్రిక్ వాటర్‌హీటర్ ద్వారా వేడిచేయటం వల్ల 25 శాతం విద్యుత్ ఖర్చవుతోందని తేలింది.సోలార్ వాటర్ హీటర్ల వినియో గదారులను, ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు వాడేవారిని ఒకసారి సర్వే చేస్తే యేడాదికి సోలార్ వాటర్ హీటర్లు వాడేవారికి 50 నుండి 85 శాతం వరకూ కరెంటు బిల్లులు తక్కువగా వచ్చినట్టు తేలింది. ఒక్కసారి సోలార్ హీటర్ ఏర్పాటు చేసుకుంటే కనీసం 15 నుంచి 40 సంవత్సరాల వరకూ చెక్కుచెదరకుండా ఉంటుంది.
సోలార్ వాటర్ హీటర్లు స్టోరేజీ ట్యాంకులు, కనెక్టర్లు, ఎలక్ట్రిక్ పంపుల ద్వారా తయారు చేయబడతాయి. వాటిలో ఫ్లాట్ప్లేట్, ఎవాక్యువేటెడ్ ట్యూబ్, కాన్సంట్రేటింగ్ వాటర్ హీటర్స్ అనే మూడు రకాలు ఉంటాయి. ఫ్లాట్ప్లేట్ కలెక్టర్ చాలామంది వాడుతుంటారు. డార్క్ అబ్సార్బర్ ప్లేట్‌తో వెదర్ ప్రూఫ్ బాక్స్ ఒకటి ట్రాన్స్పరెంట్ కవర్లతో మూసేసి ఉంటుంది. ఇక ఎవాక్యువేటెడ్ ట్యూబ్ కలెక్టర్ విషయానికి వస్తే, సమానమైన గ్లాస్ ట్యూబులతో ఉంటుంది. ప్రతి ట్యూబ్‌కి లోపల, వెలుపల గ్లాస్ ట్యూబులు లేదంటే అబ్సార్బర్ అమర్చి ఉంటాయి. సోలార్ ఎనర్జీని ఎక్కువగా అబ్సార్బ్ చేయటానికి వీలైన రంగులను మాత్రమే దీనికి వాడతారు. కాన్సంట్రేటింగ్ హీటర్స్‌ను ఇండ్లలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనికి అమర్చబడిన అద్దాల ద్వారా ఎక్కువ సోలార్ ఎనర్జీని అబ్సార్బ్ చేసుకుంటాయి. వీటిని ఇంటిపైనా లేదంటే ఇంట్లో ఓపెన్ ప్లేస్‌లో పెడుతుంటారు. మంచి సోలార్ వాటర్ హీటర్‌కి చక్కటి ఇన్సులేటెడ్ స్టోరేజ్ ట్యాంక్ కచ్చితంగా అవసరం ఉంటుంది. చాలావాటికి కన్స్విర్టెడ్ ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు వాడుతుంటారు. కానీ ఈ ట్యాంక్ వాడటం వల్ల నీరు హీటర్ ట్యాంక్‌లోకి వెళ్లేముందే కొంత వేడవుతాయి. సోలార్ వాటర్ హీటర్లు చాలా రకాలు ఉన్నాయి. అందులో చురుకుగా పనిచేసేవి ఉంటాయి. నిదానంగా పనిచేసేవీ ఉంటాయి. చురుకుగా పనిచేసే వాటికి ఎలక్ట్రిక్ పంపులు ట్యాంక్‌లోని నీటిని ఎప్పుడూ తిప్పుతూ ఉంటాయి. నిదానంగా పనిచేసేవాటికి ఎటువంటి పంపులూ ఉండవు.
వీటిని ప్రతిఒక్కరూ వాడటం వల్ల భవిష్య త్తులో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉండదు. లేకపోతే పొరుగుదేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. అంతేకాదు సోలార్ వాటర్ హీటర్లు కాలుష్యాన్ని నివారిస్తాయి. వీటిని వాడటం వల్ల కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్పార్ డైఆక్సైడ్లాంటి గాలిలో ఉండే ఇతర కాలుష్య వాయువుల నుంచి రక్షణ కలుగుతుంది. అంతేకాదు ఇరవై ఏండ్లలో యాభై టన్నుల కార్బన్‌డైఆక్సైడ్ వెదజల్లకుండా అడ్డుకోవచ్చు. పర్యావరణానికీ హాని తలపెట్టని వాళ్లమవుతాం. సోలార్ వాటర్ హీటర్ ఏర్పాటు చేసుకోవటం వల్ల ఆర్థికంగానూ లాభం చేకూరు తుంది. ఇటు కరెంటును ఆదా చేసినవారవుతాం. కేవలం సోలార్ హీటర్లే కాకుండా వీటిని పోలి ఉండే ఎటువంటి వాటర్ హీటర్లను వాడినా కాలుష్య ప్రమాదం ఉండదు. సోలార్ హీటర్ ద్వారా స్విమ్మింగ్ పూల్స్‌లో నీటిని కూడా వేడిచేసుకునే వీలుంది. మార్కెట్లో స్విమ్మింగ్ పూల్స్ కోసం ప్రత్యేకంగా సోలార్ హీటర్స్‌ను అందు బాటులో ఉంచుతున్నారు.
మార్కెట్లో సోలార్ హీటర్ కెపాసిటీని బట్టీ ధరలు ఉంటాయి. నీటిని నిలువ ఉంచుకోవడానికి కూడా మెటీరియల్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ట్యాంక్ నుండి ఇంట్లోకి పైప్‌లైన్ ద్వారా ట్యాపులకి సరఫరా చేయడానికి వేరుగా ఖర్చ వుతుంది. పైపులైన్లు కాకుండా అన్నింటినీ కలిపి 20 వేలు మొదలుకొని రూ.లక్ష వరకూ లభిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టు కోవాల్సింది ఒక్కటే. ఒక్కసారి ఏర్పరుచుకుంటే సంవత్సరాల తరబడి ఖచ్చితంగా తిరుగులేకుండా పనిచేస్తాయి. వీటిని ఏర్పాటు చేసుకోవడానికి సూర్యకిరణాలు తగిలేలా ఓపెన్‌గా ఉండే డాబాలాంటి రూఫ్ ఉండాలి. బాత్రూమ్కు దగ్గరగా ఉంటే మంచిది. పైప్‌లైన్ ఖర్చు తగ్గుంది. 2.5 మీటర్ల వెడల్పు, 7 అడుగుల ఎత్తుగల వాటర్‌ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సోలార్ వాటర్ హీటర్లను కొనుగోలు చేసేటప్పుడు ఐఎస్ఐ, ఎంఎన్ఆర్ఇ గుర్తింపు పొందిన సంస్థల ఉత్పత్తులనే ఎంచుకోవాలి. ఒకటికి రెండు సార్లు వారంటీ గురించి అడిగితెలుసుకోవాలి. బిల్లు రూపంలోనే హామీ తీసుకుంటే చాలా మంచిది. ఒకవేళ చెడిపోయిన బాగుచేయి ంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
సోలార్ హీటర్లను ఇంటి పైకప్పు మీద నీడ పడనిచోట మాత్రమే అమర్చుకోవాలి. వాటర్ ట్యాంక్ 2.5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండకూడదు. సోలార్ కనెక్టర్ ఎప్పుడూ దక్షిణం వైపు ఉండేలా అమర్చుకోవాలి. కనెక్టర్ సైజును బట్టి వేడి ఉత్పత్తవుతుంది. అందుకు హీటర్ల కోసం ఉపయోగించే ట్యూబుల రంగు ప్రధానమైనది. సహజంగా సింగిల్ కోటెడ్ నలుపు ట్యూబుల పనితీరు అంత మెరుగ్గా ఉండదు.
ట్రిపుల్ కోటెడ్ నీలిరంగు, వయలెట్ గోల్డ్ పూసినవి బాగుంటాయి. పనితీరు వేగంగా ఉంటేనే త్వరగా నీళ్లు వేడెక్కుతాయి. ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యులున్న ఇండ్లలో వేడినీటిని అందించడానికి రెండు చదరపు మీటర్ల కనెక్టర్ సరిపోతుంది. అందుకు తగ్గట్టుగా స్టోరేజ్ ట్యాంకు, ఎలక్టిక్ర్ పైపులు బిగించుకోవాలి. హీటర్లకు బ్యాకప్ సదుపాయం ఉంటే ఇంకా మంచిది. సౌర విద్యుత్ వాటర్ హీటర్లకు వాడే మెటీరియల్, నీటి సామర్థ్యాలను బట్టి వాటికి ఖర్చవుతుంది.