Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటికి తొంబైరెండేండ్ల క్రితం ఈ నేలపై ఓ కాంతిరేఖ ప్రసరించింది. సుమారు యాభై వసంతాల పాటు తెలుగు సాహిత్యానికి ''అమృతాభిషేకం'' చేసింది. ''కవితా పుష్పక''మై తెలంగాణలో ''అగ్నిధార''లు కురిపించింది. ''రుద్రవీణ''లు మోగించింది. ''తిమిరంపై సమరం'' ప్రకటించి చీకట్లను సాగుచేసి వెలుగులు పండించింది. ఆ కాంతిరేఖపేరే దాశరథి కృష్ణమాచార్యులు.
ఆయన పుట్టింది నాటి వరంగల్ జిల్లా చిన్నగూడూరులోనే అయినా తెలుగునేలనంతా ఆవరించాడు. తెలంగాణమై వినిపించాడు. మార్క్సిజం వెలుగులో దక్కన్ పీఠభూమిపై నిలబడి ప్రపంచం నలుదిక్కులకూ దృక్కులు సారించాడు...
''ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో..''
అంటూ చరిత్రను శోధించి, నిజాలను గుప్పిట పట్టుకుని విశ్వగీతమై విహరించాడు... కనుకనే
''భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో''
అని విశ్వసృష్టిని వివరించగలిగాడు. ఒకే ఒక్క వాక్యంలో బిగ్‌బాంగ్ థియరీని చెప్పేయడమే కాదు, మానవ పరిణామ వాదాన్నీ కండ్లముందుంచాడు.
''మానవ కళ్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో
రణరక్కసి కరాళనృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో
కడుపుకోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో..
అంటూ చరిత్రగతిని నినదించాడు. అన్నార్తులు అనాథలుండని మహోన్నత సమాజానికి బాటలు చూపించాడు... కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాన్ని కలగన్నాడు... భూత భవిష్యత్ వర్తమానాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ గీతం ఆయన చారిత్రక దృష్టికి ఓ మచ్చుతునక. గతితార్కిక చారిత్రక భౌతికవాద స్ఫూర్తికి ప్రతీక. మానవుడిని మానవుడిగా తీర్చిదిద్దిన వేల సంవత్సరాల క్రమక్రమానుగతాభివృద్ధిక్రమంలో ఒక్కో దశను ఒక్కో వాక్యంలో వ్యక్తీకరించడం ఆయన భావనాశక్తికి నిదర్శనం. భావుకుడు తాత్వికునిగా పరిణితి చెందడం అత్యంత సహజం. తాత్వికుడు భావుకుడు కూడా అయి ఉండకపోతే తత్వచింతనకు అర్థమే ఉండదు. దాశరథి ఈ రెండింటి సంగమం.
కవులు, రచయితలు అనధికారిక ప్రజా ప్రతినిధులు అన్న మాటను అక్షరాలా నిజం చేసాడు దాశరథి. నిద్రాణమై ఉన్న తెలంగాణ సమాజాన్ని తన కవితాస్త్రాలతో మేలుకొలిపాడు. కవిత్వంలో పోరాటాన్నీ, పోరాటంలో కవిత్వాన్నీ మమేకం చేసి తెలంగాణ సాయుధ పోరాటాన్ని సుసంపన్నంగావించాడు. నిజాం రాచరికపు క్రూరమైన దోపిడీ, రజాకార్ దౌర్జన్యాలు, ఎదురు తిరిగి మహోజ్వలంగా పోరాడిన తెలంగాణ రైతాంగం ఆయన రచనల్లో సజీవంగా కనిపిస్తారు. కవిగా, కమ్యూనిస్టు కార్యకర్తగా ఏక కాలంలో ద్విముఖ కర్తవ్యాన్ని అద్వితీయంగా నిర్వహించాడాయన. ఈ కర్తవ్య నిర్వహణలో నిర్బంధాలకు సైతం జడవక నికరంగా నిలబడ్డాడు...
''ఓ నిజాము పిశాచమా
కానరాడు నిన్ను మించిన రాజు మాకెన్నడేని''
అంటూ జైలు గోడలపై ప్రతిధ్వనించాడు. జైలులో ఉండికూడా ప్రజారాజ్యాలను అన్వేషించాడు. పేదవాడి నెత్తుటి చుక్కల్లో విప్లవాలను వెతికాడు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్గిరవ్వలు చేసి నిజాం రాచరికంపై దండయాత్ర చేసాడు.
''దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు
దిగిపోమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది
దిగిపోవోరు, తెగిపోవోరు...''
అని నిజాంను గద్దించాడు. భావ ప్రేరిత ప్రసంగాలతో గర్జించాడు. ఊరూరా సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించాడు. మన కవుల్లో చాలామందిలో కవిత్వంలో కనిపించిన పోరాటం జీవితంలో కనిపించదు. కానీ దాశరథి కవిత్వంలోనే కాదు జీవితంలోనూ పోరాట యోధుడే... గడీలను ఎదిరించినందుకు బేడీలను కానుకగా పొందినవాడు... కవి కదిలించాలి. నడిపించాలి. అది చేసి చూపించాడు దాశరథి. ''నాపేరు ప్రజాకోటి - నా ఊరు ప్రజావాటి'' అని సగర్వంగా ప్రకటించడమే గాక ''కంటికి కనిపించిందంతా - కైతగా రాస్తున్నాన'ని చెప్పాడు. నేటి తరం దాశరథి నుండి గ్రహించాల్సిందిదే. మనం మన చుట్టూ ఉన్న సమాజంతోనైనా సంబంధాల్ని కొనసాగిస్తున్నామా..? రచనకు ముడి పదార్థాన్ని పుస్తకాలు, పత్రికల నుండే గాక ప్రజల జీవితం నుండి సేకరిస్తున్నామా..? ఆలోచించుకోవాలి. దాశరథి తరువాత కాలంలో సినిమా గీతాలు రాసినా, ఆస్థానకవి కొలువులో చేరినా ఆయన ప్రజా జీవితం నుండి, పోరాటాల నుండి చేసిన రచనలే ఆయనను చరిత్రలో నిలిపాయన్నది గుర్తించి తీరాల్సిన సత్యం. అలాగని ఆయన సినీ ప్రస్థానాన్ని తక్కువ చేసి చూడలేం. ఆయన కలం ప్రళయాగ్నులే కాదు ప్రణయామృతాలూ వర్షించింది...
''తీగెలను తెంపి, అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ''
అని జన్మభూమిని ఎలుగెత్తిన కలమే..
''గోదారీ గట్టుందీ గట్టు మీదా చెట్టుందీ
చెట్టు కొమ్మన పిట్టుందీ పిట్ట మనసులో ఏముందీ''
అని చిలిపిగా ప్రశ్నించింది. అది ప్రణయగీతమైనా, కరుణరస రాగమైనా, యుగళగీతమైనా, మానవత్వం పరిమళించే ఉదాత్త కవిత్వమైనా ఆయన కలం అలవోకగా వొలికించింది.
''మదిలో వీణలు'' మ్రోగించినా, గుండెలు జెండాలుగా ఎగరేసినా ఆయనకే చెల్లింది.
''వద్దంటే గద్దెనెక్కి పెద్దరికం చేస్తావా
మూడు కోట్ల చేతులు నీ మేడను పడదోస్తాయి''
నిరంకుశుడైన నిజాం రాజుకు నిరంకుశుడైన కవి హెచ్చరిక ఇది. అందుకే కవులు నిరంకుశులు అంటారు. మరి ఇంతటి నిరంకుశుడే...
''ఏ దివిలో విరిసిన పారిజాతమో..
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో..''
అంటూ నిర్మలమైన ప్రేమ గీతాలు విరచించాడు. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే ఏ రచనకైనా జీవితమే ముడిసరుకు. అందుకే రచయితలు ప్రజల మధ్యకు వెళ్లాలి. ప్రజలతో మమేకం కావాలి. ప్రజలంటే ఎవరు..? మనం ఎవరికోసం రాస్తున్నామో, ఎవరి విముక్తిని కోరుతున్నామో వారే మన ప్రజలు. ఏ రచనకైనా గ్రంథస్త జ్ఞానం ఎంత ముఖ్యమో ప్రత్యక్ష జీవిత పరిజ్ఞానమూ అంతే ముఖ్యం. అది కథైనా, కవితైనా మరేదైనా... రచనకు జీవితమే ప్రేరణ కావాలి. అప్పుడే అందులో జీవం ఉంటుంది. నిజమైన కవినీ, కళాకారుడినీ ప్రజలూ, వారి ఆశలూ, నిరాశలూ, ఉద్యమాలూ, జీవన పోరాటాలూ ఎంతగా కదిలించగలవో, ఎంతటి అపురూప సాహిత్య సృష్టికి దోహదం చేయగలవో అనేదానికి దాశరథి రచనలే ఓ తిరుగులేని ఉదాహరణ. అందుకే ఆయన తెలుగు సాహితీలోకంలో కూర్చుంటే చార్మినార్, నిల్చుంటే కుతుబ్‌మినార్...!
-రమేష్ రాంపల్లి